YCP vs TDP : టిడిపి కంచుకోటను బద్దలు కొట్టే పనిలో వైసిపి

YCP vs TDP : టిడిపి కంచుకోటను బద్దలు కొట్టే పనిలో వైసిపి

వైసిపి హై కమాండ్ మాత్రం పక్కా గెలుపు ఆశతో ఉంది. మరి ఇచ్ఛాపురంలో టిడిపి గెలుపు పొందుతుందా? లేకుంటే రికార్డును బ్రేక్ చేసి వైసిపి కైవసం చేసుకుంటుందా? అన్నది చూడాలి.

YCP vs TDP : శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. గత ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో సైతం ఈ స్థానం టిడిపికి దక్కింది. ఎమ్మెల్యేగా డాక్టర్ బెందాళం అశోక్ గెలుపొందారు. టిడిపికి సంస్థాగతంగా బలమున్న నియోజకవర్గాల్లో ఇచ్చాపురం ఒకటి. ఆ పార్టీ ఆవిర్భావం తర్వాత ఒకే ఒక్కసారి టిడిపి ఓడిపోయింది. మిగతా అన్ని ఎన్నికల్లో ఆ పార్టీదే విజయం. అందుకే ఈసారి ఇచ్చాపురంను వైసీపీ ఖాతాలో వేయడానికి జగన్ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో ఎనిమిది సార్లు టిడిపి విజయం సాధించింది. ఎంవి కృష్ణారావు వరుసగా నాలుగు సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒకసారి ఆయన పై ఎన్నికల నిబంధనల విషయంలో అనర్హత వేటు పడడంతో.. ఆయన అనుచరుడు టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2004లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి నరేష్ కుమార్ అగర్వాల్ అనూహ్య విజయం దక్కించుకున్నారు. 2009లో ఎన్నికలకు నెల రోజులు ముందు టిడిపి అభ్యర్థిగా తెరపైకి వచ్చిన పిరియ సాయిరాజ్ విజయం సాధించడం విశేషం. కానీ ఆయన అనూహ్యంగా వైసీపీ గూటికి చేరారు. దీంతో 2014 ఎన్నికల్లో డాక్టర్ బెందాలం అశోక్ కి టికెట్ దక్కింది. ఆ ఎన్నికల్లో అశోక్ విజయం సాధించారు. 2019లో సైతం మరోసారి గెలుపొందారు.

తెలుగుదేశం పార్టీ అశోక్ అభ్యర్థిత్వాన్ని మరోసారి ప్రకటించింది. కానీ ఈసారి ఎలాగైనా ఇచ్చాపురం నియోజకవర్గాన్ని కైవసం తీసుకోవాలని జగన్ మాస్టర్ ప్లాన్ వేశారు. ఎమ్మెల్సీ తో పాటు కీలక నామినేటెడ్ పదవులను ఈ నియోజకవర్గ నేతలకు కేటాయించారు. స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ గా నర్తు రామారావును ఎంపిక చేశారు. రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవులను సైతం ఈ నియోజకవర్గ నేతలకు కట్టబెట్టారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా మాజీ ఎమ్మెల్యే సాయిరాజ్ భార్య విజయను ఎంపిక చేశారు. ఆమెకే వైసిపి టిక్కెట్ను కేటాయించారు. దీంతో నేతలందరూ సమన్వయంతో పనిచేసి వైసీపీ విజయానికి పాటుపడతారని జగన్ భావించారు. అయితే పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. వైసీపీలో ఇప్పటికీ వర్గాలు కొనసాగుతున్నాయి. మరోవైపు ప్రభుత్వపై వ్యతిరేకత పతాక స్థాయిలో ఉంది. ఈ తరుణంలో అశోక్ గెలుపు నల్లేరు మీద నడక అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వైసిపి హై కమాండ్ మాత్రం పక్కా గెలుపు ఆశతో ఉంది. మరి ఇచ్ఛాపురంలో టిడిపి గెలుపు పొందుతుందా? లేకుంటే రికార్డును బ్రేక్ చేసి వైసిపి కైవసం చేసుకుంటుందా? అన్నది చూడాలి.