ఘోర రోడ్డు ప్రమాదం - యస్ ఐ కుటుంబం మృతి
ఘోర ప్రమాదం: అద్దంకి ఎస్సై భార్య, కుమార్తె సహా ఐదుగురు మృతి, టైర్ పంక్చరే కారణం
బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్ల బైపాస్‌లో జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు.
గుంటూరు: బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొరిశపాడు మండలం మేదరమెట్ల బైపాస్‌లో జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. టైరు పంక్చర్ కావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
టైర్ పంక్చర్ కావడంతో పల్టీలు కొట్టిన కారు
ప్రమాద ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..టీఎస్ 07 జీడీ 3249 నెంబర్ గల కారు ఒంగోలు వైపు నుంచి గుంటూరు వైపు వెళ్తోంది. మేదరమెట్ల సౌత్ బైపాస్ సమీపంలోకి రాగానే కారు టైరు పంక్చరై అదుపుతప్పి డివైడర్ దాటి అవతలి వైపునకు పల్టీలుకొడుతూ ఎగిరివెళ్లి పడిపోయింది. అదే సమయంలో గుంటూరు నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న లారీ కారును ఢీకొట్టింది.
ప్రమాదంలో అద్దంకి ఎస్ఐ భార్య, కూతురుతోపాటు ఐదుగురు మృతి
ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో అద్దంకి ఎస్సై సమందరవలి భార్య వహీదా(35), కుమార్తె అయేషా(9), ఫ్యామిలీ ఫ్రెండ్స్ బుర్రాల జయశ్రీ(50), బుర్రాల దివ్యతేజ(29), డ్రైవర్ బ్రహ్మచారి(22) ఉన్నట్లు గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అద్దంకి సీఐ రోశయ్య ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. వీరంతా చినగంజాం తిరునాళ్లకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిపారు.
భార్య, కూతురు మృతితో కన్నీరుమున్నీరైన ఎస్ఐ
ఈ ఘటనలో కారులు ఇరుక్కుపోయిన ఇద్దరిని హైవే పోలీసులు బయటకు తీశారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఎస్సై సమందరవలి విధి నిర్వహణలో ఉన్నారు. ప్రమాదం గురించి సమాచారం అందనేగా.. ఘటనా స్థలానికి చేరుకున్న సమందరవలి, వారి కుటుంబసభ్యులు మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. వారి రోదనలు అక్కడివారిని కంటతడి పెట్టించాయి. ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.