గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023: లైవ్ అప్‌డేట్స్
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023.. దేశ, విదేశీ కార్పోరేట్ దిగ్గజాలన్నింటినీ ఒకే వేదికపై తీసుకురావడమే లక్ష్యంగా ఈ సదస్సును ఏర్పాటు చేశారు. రాష్ట్ర చరిత్రలో పారిశ్రామిక అభివృద్ధి గతంలో జరిగిన సదస్సులకు భిన్నంగా వాస్తవితకు దగ్గరగా ప్రస్తుత సదస్సు జరగబోతుంది.
ఆహుతులకు ఆత్మీయ స్వాగతం
విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్ ప్రాంగణంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ - 2023కు హాజరవుతున్న ఆహుతులకు సాంప్రదాయ నృత్యరూపకాలతో ఆత్మీయ స్వాగతం పలుకుతున్న కళాకారులు.
కీలక పెట్టుబడులే ప్రధాన లక్ష్యం
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల మైదానం వేదికగా రెండు రోజుల పాటు నిర్వహించే సదస్సులో రాష్ట్రంలో ఉన్న 14 కీలక రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశ, విదేశాల నుంచి దిగ్గజ పారిశ్రామికవేత్తలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, హాజరవుతున్నారు. 45 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరవుతున్న ఈ సదస్సుకు సంబంధించి ఇప్పటికే రిజిస్ట్రేషన్లు 18 వేలు దాటడం విశేషం.ముఖేష్ అంబానీ, కుమార మంగళం బిర్లా, కరణ్ అదానీ, సంజీవ్ బజాజ్, అర్జున్ ఒబెరాయ్, సజ్జన్ జిందాల్, నవీన్ జిందాల్, మార్టిన్ ఎబర్ హార్డ్డ్, హరిమోహన్ బంగూర్, సజ్జన్ భజాంకా వంటి 30కి పైగా కార్పొరేట్ దిగ్గజ ప్రముఖులు రెండు రోజుల సదస్సులో పాల్గొంటున్నారు. ఈ సదస్సు ఏర్పాట్లపై సీఎం ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నారు. గురువారం సాయంత్రమే విశాఖకు చేరుకుని, ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డితో పాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుడివాడ అమరనాథ్‌లు సభా స్థలి, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించారు.కార్పొరేట్ ప్రముఖులు విమానాశ్రయం నుంచి నేరుగా సభా స్థలికి చేరుకునేందుకు మూడు హెలిపాడ్స్‌ను సిద్ధం చేశారు. అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాల ద్వారా కదలికలను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నారు. తొలిసారిగా స్నిఫర్ డాగ్స్‌తో కే9 సెక్యూరిటీ వ్యవస్థ ఏర్పాటు చేశారు.
14 రంగాల్ని ప్రమోట్ చేస్తున్న ప్రభుత్వం రాష్ట్రంలో సరళమైన పారిశ్రామిక విధానం, సీఎం వైఎస్ జగన్ విశ్వసనీయతకు ఆకర్షితులై దిగ్గజ పరిశ్రమలన్నీ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అడుగులు ముందుకు వేస్తున్నాయి. అడ్వాంటేజ్ ఏపీ పేరుతో రాష్ట్రంలో ఉన్న వనరులు, వసతుల్ని ప్రపంచానికి పరిచయం చేసే విధంగా ఈ సదస్సు జరగనుంది. మూడున్నరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలలో 90 శాతానికి పైగా గ్రౌండ్ అయ్యాయి. అదే స్ఫూర్తితో ఈ సదస్సులో చేసుకునే ఒప్పందాలు 100 శాతం గ్రౌండ్ అవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది.రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి మెరుగైన అవకాశాలు ఉన్న 14 రంగాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. పునరుత్పాదక ఇంధన వనరులు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, హెల్త్‌కేర్ అండ్ మెడికల్ ఎక్విప్‌మెంట్, ఎంఎస్‌ఎంఈ, స్టార్టప్స్ అండ్ ఇన్నోవేషన్స్, స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎడ్యుకేషన్, ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫార్మాస్యుటికల్స్ అండ్ లైఫ్ సైన్సెస్, ఆటోమొబైల్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ, అగ్రి అండ్ ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్‌టైల్స్ అండ్ అప్పరెల్స్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, పెట్రోలియం అండ్ పెట్రోకెమికల్స్ తదితర రంగాలపై ఫోకస్ చేస్తోంది.ఈ రంగాలకు సంబంధించిన కేంద్ర మంత్రులను ఆహ్వానించారు. వారంతా ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ఆడియో వీడియో విజువల్ ప్రదర్శన అనంతరం సంబంధిత అధికారులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు ప్రసంగించనున్నారు. సభా ప్రాంగణానికి పక్కనే ఉన్న మరో గదిలో 20కి పైగా బ్రేక్ అవుట్ బిజినెస్ సెషన్లు జరగనున్నాయి. సభా ప్రాంగణంలోనే సీఎం కార్యాలయం.. లాంజ్, సమావేశ మందిరం, వ్యక్తిగత గదులను సిద్ధం చేశారు. ఆ పక్కనే మంత్రులకు, మీడియా ప్రతినిధులకు వేర్వేరుగా డైనింగ్ సౌకర్యం కల్పించారు.