Indian Students | యూఎస్‌కి దారేదీ?.. ట్రంప్ నిర్ణయాలతో భారతీయ విద్యార్థులకు తప్పని ఇబ్బందులు

అమెరికాకు వెళ్లి చదువుకుని తమ డాలర్ డ్రీమ్స్‌ను నెరవేర్చుకోవాలని కలలు కంటున్న భారతీయ విద్యార్థులకు ట్రంప్ నిర్ణయాలు ఇబ్బందికరంగా మారాయి. అక్రమ వలసదారులపై అక్కడి అధికారులు ఉక్కుపాదం మోపుతుండగా ఎక్కడ పట్టుబడతామో అని ఇప్పటికే మన విద్యార్థులు చాలా మంది పార్ట్ టైమ్ జాబ్స్‌ను మానేశారు.
- స్టూడెంట్ వీసాల జారీ నిలిపివేసిన అగ్ర రాజ్యం
- ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెట్టే వారిపై నిశితంగా నిఘా
- చట్ట విరుద్ధ పనులు చేసినా, వాటి గురించి చర్చించినా వీసా రద్దు, దేశ బహిష్కరణ
- దీంతో యూరప్ దేశాల్లోని చదువులపై మన విద్యార్థుల ఆరా
- అమెరికాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొద్దు
- ఆఫ్ క్యాంపస్‌లో పార్ట్ టైం ఉద్యోగాలు చేయకండి
- తెలుగు విద్యార్థులకు కన్సల్టెన్సీ సంస్థల కీలక సూచనలు
Indian Students | హైదరాబాద్ (నమస్తే తెలంగాణ): అమెరికాకు వెళ్లి చదువుకుని తమ డాలర్ డ్రీమ్స్‌ను నెరవేర్చుకోవాలని కలలు కంటున్న భారతీయ విద్యార్థులకు ట్రంప్ నిర్ణయాలు ఇబ్బందికరంగా మారాయి. అక్రమ వలసదారులపై అక్కడి అధికారులు ఉక్కుపాదం మోపుతుండగా ఎక్కడ పట్టుబడతామో అని ఇప్పటికే మన విద్యార్థులు చాలా మంది పార్ట్ టైమ్ జాబ్స్‌ను మానేశారు. ఇదిలా ఉంటే మరోవైపు స్టూడెంట్ వీసాల జారీని అమెరికా నిలిపివేసింది. ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంపై పలు వర్సిటీల్లో ఆందోళనలు, కొన్ని వర్సిటీల్లో ఉగ్రవాదానికి మద్దతుగా చర్యలు ఉన్నాయని అమెరికా భావిస్తున్నది. దీంతో విదేశీ విద్యార్థుల లింక్డ్ ఇన్ సహా ఇతర సోషల్ మీడియాల ప్లాట్‌ఫామ్‌ల ఖాతాలను అమెరికా అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టూడెంట్ వీసాల జారీని అమెరికా తాత్కాలికంగా నిలిపివేసింది. వీసా కోసం దరఖాస్తు చేసిన విద్యార్థుల్లో ఎవరైనా తమ దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారా అనేది అధికారులు వెరిఫికేషన్ చేయనున్నారు.
కొత్త స్టూడెంట్ వీసా అప్లికేషన్‌లో మార్పులు
అమెరికాకు వ్యతిరేకంగా లేరని భావిస్తేనే విదేశీ విద్యార్థులను అమెరికాలో ఉండేందుకు అర్హత కల్పించనున్నారు. మరోవైపు తమ దేశంలో ఉండి చట్ట విరుద్ధ పనుల గురించి ఎవరైనా చాటింగ్ చేసి ఉంటే వారిపైనా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. దీంతో భారత విద్యార్థుల్లో ఆందోళన నెలకొన్నది. అయితే కొత్త వీసా అప్లికేషన్‌లో మార్పులు చేసి త్వరలోనే వీసా ఇంటర్వ్యూలకు అమెరికా పిలవనున్నట్టు కన్సల్టెన్సీ వర్గాలు తెలిపాయి. అయితే మన దగ్గర వీసాలకు దరఖాస్తు చేసిన వాళ్లు తదుపరి ప్రకటన వెలువడే లోపు వీసా పత్రాల సమర్పణను పూర్తి చేయాలని వారు సూచిస్తున్నారు. అదే సమయంలో యూఎస్ స్టూడెంట్ వీసాపై మాత్రమే నమ్మకం పెట్టుకొని సమయం వృథా చేయొద్దని.. యూరప్ దేశాల్లో చదవులు, అక్కడి పరిస్థితులపై అధ్యయనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఏటా 40-50 వేల మంది విద్యార్థులు
ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి స్టడీ వీసా కోసం యూనివర్సిటీలను బట్టి రూ.35 లక్షల నుంచి రూ.కోటి వరకు ఖర్చు చేసి మన విద్యార్థులు అమెరికాలో చదువుకోవడానికి వెళ్తున్నారు. ఏటా 40-50 వేల మంది తెలుగు విద్యార్థులు అగ్ర రాజ్యానికి వెళ్తున్నారు. చదువుకునేటప్పుడు పార్ట్ టైం జాబ్ చేసుకునే వెసులుబాటు, చదువయ్యాక మూడేండ్ల వరకు పని చేసుకునే వీలు ఉండటంతో మనవాళ్లు అమెరికా వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక పరిస్థితులు మారిపోయాయి. యూఎస్ వరుస ఆంక్షలతో మన విద్యార్థులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో వారు యూరప్‌లో విద్యాభ్యాసం గురించి ఆరా తీయడం మొదలుపెట్టారని కన్సల్టెన్సీలు తెలిపాయి.
రూల్స్ పాటిస్తే సమస్యలుండవు
స్టడీ వీసా మీద యూఎస్‌కు వెళ్లిన విదేశీ విద్యార్థులు ఆన్ క్యాంపస్‌లో మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది. అంటే యూనివర్సిటీ పరిధిలో ఉండే లైబ్రేరియన్, సర్వింగ్, ప్రొఫెసర్‌ల వద్ద అసిస్టెంట్ ప్రొఫెసర్ వంటి ఉద్యోగాలు మాత్రమే చేయాలి. అలా కాదని ఆఫ్ క్యాంపస్(వర్సిటీకి అవతల)లో పని చేయడం అమెరికా చట్టాల ప్రకారం విరుద్ధం. అయితే మన వాళ్లలో చాలా మంది క్యాష్ ఇన్ హ్యాండ్ పద్ధతిలో క్యాంపస్ బయట పనిచేస్తున్నారు. వీరు పనిచేస్తూ కనిపిస్తే పోలీసులు దేశ బహిష్కరణ చేసి స్వదేశానికి పంపించేస్తున్నారు.
యూఎస్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెటొద్దు
అమెరికాకు వెళ్లి చదివాలనుకునేవారు ఆ దేశానికి వ్యతిరేకంగా ఎలాంటి పోస్టులు పెట్టొద్దు. ప్లాన్-బితో రెడీగా ఉండాలి. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రెయినింగ్ (ఓపీటీ)తో భయపడాల్సిన అవసరం లేదు. యూనైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్‌సీఐఎస్) వెబ్‌సైట్‌లో విద్యార్థులు తమ వివరాలను పారదర్శకంగా అప్‌డేట్ చేయాలి. పార్ట్‌టైమ్ జాబ్స్ చేయాలనుకునే వారు ఆఫ్ క్యాంపస్‌లో ఉద్యోగాలు చేయొద్దు. నిబంధనలు పాటిస్తే ఇబ్బందులు ఉండవు.
చట్టాలను ఉల్లంఘించొద్దు
అమెరికా చట్టాలను విదేశీ విద్యార్థులు తప్పనిసరిగా పాటించాలి. చట్టాలను ఉల్లంఘించే వారి పట్ల అక్కడి ప్రభుత్వం జీరో టాలరెన్స్(ఏమాత్రం ఊపేక్షించకుండా ఉండటం) విధానం అవలంబిస్తున్నది. చట్టాలను ఉల్లంఘిస్తే వీసా రద్దుతోపాటు దేశ బహిష్కరణకు అవకాశం ఉంది.