సినిమాల్లోకి వెళ్లాలనుకున్నా.. క్రికెటర్‌ నయ్యా: వరుణ్ చక్రవర్తి

సినిమాల్లోకి వెళ్లాలనుకున్నా.. క్రికెటర్‌ నయ్యా: వరుణ్ చక్రవర్తి
  • న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లు తీసుకున్న వరుణ్ చక్రవర్తి
  • క్రికెట్‌ను తాను 26 ఏళ్ల వయసులో ప్రారంభించానన్న మిస్టరీ స్పిన్నర్
  • ఆర్కిటెక్ట్ కావాలని, సినిమాల్లోకి వెళ్లాలనని కలులు కన్నానన్న వరుణ్

చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్‌తో దుబాయ్‌లో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అత్యద్భుత ప్రదర్శనతో దేశం దృష్టిని ఆకర్షించాడు. 5 వికెట్లు తీసి కివీస్ నడ్డి విరిచాడు. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. 

 మ్యాచ్ అనంతరం వరుణ్ మాట్లాడుతూ.. తన క్రికెట్ జర్నీని వివరించాడు. క్రికెట్‌ను తాను చాలా ఆలస్యంగా  26 ఏళ్ల వయసులో ప్రారంభించానని తెలిపాడు. అంతకుముందు తానొక ఆర్టిటెక్ట్‌నని, సినిమాలు చేయాలని కలులు కనేవాడినని వివరించాడు. తన కెరీర్ మార్గాలు వేరని చెప్పుకొచ్చాడు. 26 ఏళ్ల తర్వాతే క్రికెట్ గురించి కలలు కనడం ప్రారంభించానని తెలిపాడు. ఇప్పుడది సాకారమైందని వివరించాడు.

2021 ఫ్లాష్‌బ్యాక్ మదిలో మెదులుతుండటంతో మ్యాచ్ ప్రారంభంలో కొంత ఆందోళనకు గురయ్యానని వరుణ్ చెప్పాడు. 2021 ప్రపంచకప్‌లో ఎదురైన చేదు అనుభవాన్ని తన మనసులోంచి తుడిచివేయడంలో కోహ్లీ, రోహిత్‌శర్మ సాయం చేశారని, బంతిబంతికీ తనతో మాట్లాడుతూ తనలోని భయాలను తరిమికొట్టారని చెబుతూ వారికి థ్యాంక్స్ చెప్పాడు. కాగా, 2021 ఐపీఎల్‌లో ఆకట్టుకున్న వరుణ్ భారత టీ20 జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే, టీ20 ప్రపంచకప్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.

కాగా, న్యూజిలాండ్‌పై గెలుపుతో భారత జట్టు లీగ్ దశలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా నాకౌట్‌కు ప్రవేశించింది. రేపు (4న) దుబాయ్‌లో ఆస్ట్రేలియాతో జరగనున్న సెమీస్‌లో రోహిత్ సేన తలపడుతుంది. ఆ మ్యాచ్‌లోనూ వరుణ్ అంచనాలను అందుకుంటాడని అభిమానులు ధీమాగా ఉన్నారు.