పహల్గాం ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి దృష్ట్యా, రాష్ట్ర ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయాలని గౌరవ డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా BSR NEWS

చిత్తూరు జిల్లా పోలీసు పత్రికా ప్రకటనపహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో జిల్లావ్యాప్త భద్రతా చర్యలు – కట్టుదిట్టమైన తనిఖీలు పహల్గాం ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి దృష్ట్యా, రాష్ట్ర ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయాలని గౌరవ డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా, IPS గారు రాష్ట్రంలోని అన్ని కమిషనరేట్లు మరియు జిల్లాల్లో 26-04-2025 నాటి సాయంత్రం 4.00 గంటల నుండి 6.00 గంటల వరకు ప్రత్యేక భద్రతా తనిఖీలను చేపట్టాలని ఆదేశించారు.ఈ ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ వి.ఎన్. మణికంఠ చందోలు, IPS గారి ఆధ్వర్యంలో, ఈరోజు జిల్లా వ్యాప్తంగా దేవాలయాలు, బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్‌లు, లాడ్జిలు తదితర ప్రదేశాలలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించడమేకాక, ముఖ్య కూడళ్లలో వాహనాలను సమగ్ర తనిఖీలు చేపట్టారు.ఈ భద్రతా తనిఖీలను మరింత ప్రభావవంతంగా అమలు చేసేందుకు చిత్తూరు జిల్లా ఎస్పీ గారు స్వయంగా పాల్గొని పట్టణంలోని ప్రధాన కూడలి అయిన రెడ్డిగుంట జంక్షన్ వద్ద తనిఖీలను నిర్వహించారు.ఈ తనిఖీలలో చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధగాంచిన శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం నందు చిత్తూరు జిల్లా బాంబు స్క్వాడ్ వారు విస్తృత తనిఖీలు నిర్వహించారు. పట్టణములోని బస్టాండ్, రైల్వే స్టేషన్ మరియు ఇతర జనసమ్మేళన ప్రదేశాల నందు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ ద్వారా అనుమానిత వ్యక్తులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, విదేశీ వ్యక్తులు, వలస వచ్చినవారి సమాచారం సేకరించడం, వారి గుర్తింపు పత్రాలను పరిశీలించారు.బయటి నుంచి వచ్చిన వ్యక్తులు నివసించే హోటళ్లు, లాడ్జిలను పోలీసులు పరిశీలించి, అక్కడ బస చేస్తున్న వ్యక్తుల పూర్తి వివరాలను సేకరించారు. వారి గుర్తింపు పత్రాలను ధృవీకరించి, వారి రాకపోకలపై సమగ్ర సమాచారం పొందడం ద్వారా నేర నిరోధక చర్యల్లో జాగ్రత్తలు తీసుకున్నారు. చిత్తూరు జిల్లా రెండు రాష్ట్రాలకు సరిహద్దు జిల్లాగా ఉన్న కారణంగా, జిల్లాసరిహద్దులు మరియు ప్రవేశ/నిష్క్రమణ పాయింట్ల వద్ద వాహనాలను సమగ్రంగా తనిఖీ చేయడం జరిగింది. ప్రత్యేకంగా, జిల్లాల మధ్య సంచరించే అనుమానాస్పద వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించి ఈ తనిఖీలు నిర్వహించబడ్డాయి. తనిఖీల వివరాలు: ఈ తనిఖీలో బాగంగా జిల్లా వ్యాప్తంగా 2378 వాహనాలను తనిఖీ చేయగా, మోటార్ వెహికల్ ఆక్ట్ కింద 188 కేసులు నమోదు చేసారు. 74,195/- రూపాయల ఫైన్ విధించడం జరిగింది. బహిరంగంగా మద్యం సేవిస్తున్న 07 మంది పై కేసులు నమోదు చేసి జరిమానా విధించడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 65 లాడ్జిలలో 395 రూమ్లను తనిఖి చేయడం జరిగింది. బస్టాండ్ లు మరియు రైల్వే స్టేషన్ లలో 268 మంది అనుమానాస్పద వ్యక్తులను తనిఖి చేసారు. ఈ కార్యక్రమం ప్రజలకు భద్రత కల్పించడమే కాకుండా, ఏవైనా అపాయాలను ముందుగానే గుర్తించి నివారించడమే ప్రధాన ఉద్దేశ్యంగా చేపట్టామని, జిల్లా వ్యాప్తంగా పోలీస్ విభాగం పూర్తి అప్రమత్తతతో పని చేస్తోందని, ప్రతి పోలీసు అధికారులు, సిబ్బంది నిరంతరం ప్రజల రక్షణ కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాము. “ప్రజల భాగస్వామ్యంతోనే భద్రతను పరిరక్షించగలం. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ఏవైనా అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు గమనిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా చిత్తూరు పోలీస్ Whatsapp నెంబర్ 9440900005 కు సమాచారం ఇవ్వాలని, భద్రతా చర్యలు మీ భద్రత కోసమే చేపడుతున్నాం. పోలీసు శాఖ ప్రజల రక్షణకు కట్టుబడి ఉంది" అని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.