Yashasvi Jaiswal : ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో జైస్వాల్ పరుగుల వరద.. కోహ్లి రికార్డు సమం..

BSR NEWS
టీమ్ఇండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ అరుదైన ఘనతను సాధించాడు.
Yashasvi Jaiswal – Virat Kohli : టీమ్ఇండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ అరుదైన ఘనతను సాధించాడు. ఇప్పటి వరకు ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లలో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి రికార్డును సమం చేశాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లలో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లుగా కోహ్లి, యశస్వి లు సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. వీరిద్దరు కూడా 655 పరుగులు చేశారు.
రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ లో యశస్వి 44 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లతో 37 పరుగులు చేసి జోరూట్ బౌలింగ్‌లో జేమ్స్ అండర్సన్ క్యాచ్ అందుకోవడంతో పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఈ పరుగులతోనే యశస్వి.. కోహ్లి రికార్డును సమం చేశాడు. ఈ సిరీస్‌లో మరో టెస్టు మ్యాచ్ మిగిలి ఉన్న నేపథ్యంలో కోహ్లి రికార్డును యశస్వి బద్దలు కొట్టే అవకాశం ఉంది. మార్చి 7 నుంచి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదో టెస్టు మ్యాచ్ ధర్మశాల వేదికగా జరగనుంది.