అంతరిక్ష అద్భుతం.. ఒకే ఫొటోలో భూమి సహా ఎనిమిది గ్రహాలు

అంతరిక్ష అద్భుతం.. ఒకే ఫొటోలో భూమి సహా ఎనిమిది గ్రహాలు
  • BSR NEWS
  • చరిత్రలో ఇదే ఫస్ట్ ఫొటో అంటున్న నిపుణులు
  • భూమితో పాటు మొత్తం 8 గ్రహాలను కెమెరాలో బంధించిన ఫొటోగ్రాఫర్
  • అంతరిక్షంలో ప్లానెటరీ పరేడ్ సమయంలో తీసిన ఫొటో

అంతరిక్షంలో అత్యంత అరుదుగా చోటుచేసుకునే ప్లానెటరీ పరేడ్ ను జోష్ డ్యూరీ అనే ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించాడు. మొత్తం 8 గ్రహాలు కనిపించేలా ఫొటో తీశాడు. ఈ నెల 22న ప్లానెటరీ పరేడ్ జరిగింది. సౌరమండలంలో తమ తమ కక్షలలో తిరుగుతూ గ్రహాలన్నీ ఒకే వరుసలోకి వచ్చాయి. భూమి పైనుంచి టెలిస్కోప్ ల సాయంతో చాలామంది ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించారు. భారత్ లో ఈ రోజు (శుక్రవారం 28న) రాత్రి ఈ అద్భుతాన్ని చూడొచ్చు. మిగతా ఏడు గ్రహాలను టెలిస్కోప్ ల సాయంతో చూడొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉండే బుధ గ్రహం నుంచి దూరంగా ఉండే నెఫ్ట్యూన్ వరకు మొత్తం ఏడు గ్రహాలను భూమి పై నుంచి చూడగలిగే ఈ అరుదైన అవకాశం మళ్లీ నలభై ఏళ్ల తర్వాతే వస్తుందని వివరించారు. చివరిసారిగా 1982లో అంతరిక్షంలో ఈ ప్లానెటరీ పరేడ్ జరిగిందని చెప్పారు.

ఫొటో ఎలా తీశాడంటే..
అంతరిక్ష ఫొటోగ్రాఫర్ గా పేరొందిన జోష్ డ్యూరీ ఈ నెల 22న జరిగిన ప్లానెటరీ పరేడ్ ను కెమెరాలో బంధించేందుకు ఇంగ్లాండ్ లోని సోమర్ సెట్ అనే గ్రామాన్ని ఎంచుకున్నారు. అక్కడి మెండిప్ హిల్స్ కొండల పైనుంచి విశాలమైన ఆకాశం బాగా కనిపిస్తుంది. మొత్తం ఏడు గ్రహాలను ఒకే ఫొటోలో బంధించేందుకు పనోరమా మోడ్ ను ఉపయోగించినట్లు డ్యూరీ చెప్పారు. సూర్యుడికి అత్యంత సమీపంలో ఉండే బుధుడిని అలాగే నెఫ్ట్యూన్, శాటర్న్ గ్రహాలను గుర్తించడంలో కాస్త ఇబ్బంది పడినట్లు వివరించారు. అయితే, ఇమేజ్ అనాలసిస్, ఆస్ట్రానమీ యాప్ ల సాయంతో గ్రహాలను గుర్తించానని తెలిపారు. పనోరమా మోడ్ లో ఫిష్ ఐ లెన్స్ ల సాయంతో ఏడు గ్రహాలను ఒకే ఫ్రేమ్ లో బంధించినట్లు డ్యూరీ వివరించారు.