Wipro News: లేబర్ మినిస్టర్ దగ్గరకు విప్రో వ్యవహారం.. ఐటీ ఉద్యోగుల యూనియన్ ఫిర్యాదు..
Wipro News: లేబర్ మినిస్టర్ దగ్గరకు విప్రో వ్యవహారం.. ఐటీ ఉద్యోగుల యూనియన్ ఫిర్యాదు..
Wipro News: దేశీయ టెక్ దిగ్గజం విప్రో తాజా మరో
వివాదంలో చిక్కుకుంది. కంపెనీ తీసుకున్న నిర్ణయం
కారణంగా మరోసారి వార్తల్లో నిలిచింది. అంతర్జాతీయంగా టెక్ కంపెనీల వ్యాపార పరిస్థితులు గందరగోళానికి గురవుతున్న తరుణంలో దేశీయ ఐటీ సేవల కంపెనీ వివాదాస్పద నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.అసలు ఏమైంది..ఐటీ రంగంలో ఫ్రెషర్ల పరిస్థితి ఎంతదయనీయంగా ఉందనే విషయం అనేక మార్లు వెల్లడైంది. ఎన్నో ఆశలతో చదువు పూర్తి చేసుకుని కార్పొరేట్ కంపెనీల్లో కొలువు
సంపాదించినప్పటికీ యువ టెక్కీలు మంచి జీతాలను పొందలేకపోతున్నారని ఆందోళనలు ఉన్నాయి. ఈ క్రమంలో విప్రో ఫ్రెషర్లకు గతంలో రూ.6 లక్షల కంటే ఎక్కువ మెుత్తానికి ప్యాకేజీని ఆఫర్ చేసింది. అయితే ప్రస్తుతం వారికి కొత్త ఆఫర్ లెటర్లలో రూ.3.50 లక్షల జీతాన్ని అందిస్తామని తెలిపింది.విప్రోపై ఫిర్యాదు..ఐటీ ఎంప్లాయీస్ యూనియన్ నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్(NITES).. టెక్ దిగ్గజం విప్రోపై కార్మిక మంత్రిత్వ శాఖకు బుధవారం ఫిర్యాదు చేసింది. ఫ్రెషర్ల జీతాన్ని తగ్గించి ఒప్పందం ఉల్లంఘనకు పాల్పడిందని తెలిపింది. కంపెనీ చేపట్టిన ఈ చర్యలు ఆఫర్ లెటర్ నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించడమేనని అందులో యూనియన్ తెలిపింది..ఏడాదిగా పడిగాపులు..ఫ్రెషర్లు దాదాపు కంపెనీలో ఆన్ బోర్డింగ్ కోసం 12 నెలలకు పైగా ఎదురుచూశారు. అయితే పాత ఆఫర్ లెటర్ లో తెలిపిన రూ.6.50 లక్షల ప్యాకేజీని వదులుకుని.. కొత్తగా అందిస్తామన్న రూ.3.50 లక్షలకు ఒప్పుకునేవారికి త్వరగా ఆన్ బోర్డింగ్ చేస్తామని వెల్లడించింది. దీనిపై స్పందించిన కొందరు విద్యార్థులు కంపెనీ తమను ట్రాప్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇతర ఐటీ కంపెనీలు..దేశంలోని టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, క్యాప్ జెమినీ, యాక్సెంచర్, ఎంఫసిస్ వంటి టెక్ కంపెనీలు సైతం గడచిన 12 నెలలుగా ఫ్రెషర్ రిక్రూట్‌లను ఆన్‌బోర్డింగ్ చేయడంలో ఆలస్యం చేస్తున్నాయి. ఈ క్రమంలో విప్రో ఆఫర్ లెటర్ నిబంధనలను గౌరవించేలా, ఉద్యోగులకు జీతాలను నైతికంగా తగ్గించకుండా సత్వర చర్యలు తీసుకునేలా కార్మిక శాఖను ఆదేశించాలని NITES యూనియన్ కోరింది.