Pawan Kalyan And Chandrababu: పవన్ కళ్యాణ్ చంద్రబాబు తేల్చేది ఎప్పుడు?

ఇటీవల కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో చంద్రబాబు నాయుడు పొత్తులపై తీవ్రంగా చర్చించారు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఒక్కసారిగా చంద్రబాబు సైలెంట్ అయిపోయారు.
Pawan Kalyan And Chandrababu: ఏపీలో రాజకీయ వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. సిద్ధమంటూ వైయస్ జగన్మోహన్ రెడ్డి భారీ సభలు నిర్వహిస్తున్నారు. జనాలు కూడా బాగా వస్తుండడంతో వైసీపీలో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇదే క్రమంలో పలు నియోజకవర్గాలకు జగన్ మోహన్ రెడ్డి అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు రిక్తహస్తం చూపిస్తున్నారు. అయితే ఇదే ఊపు టిడిపి, జనసేన కూటమిలో కనిపించడం లేదు. పైగా ఆ కూటమిలోకి ఇప్పుడు బిజెపి వస్తోంది అనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. బిజెపి గనుక కూటమిలో చేరితే సీట్ల కేటాయింపు ఎలా ఉంటుందనేది అంతు పట్టడం లేదని టిడిపి నాయకులు అంటున్నారు.
ఇటీవల కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో చంద్రబాబు నాయుడు పొత్తులపై తీవ్రంగా చర్చించారు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఒక్కసారిగా చంద్రబాబు సైలెంట్ అయిపోయారు. టిడిపి కార్యాలయానికి ఇన్ ఛార్జ్ లను పిలిపించుకుని మాట్లాడుతున్నారు. బహిరంగ సభలు మాత్రం నిర్వహించడం లేదు. మరోవైపు లోకేష్ శంఖారావం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. విశ్వసనీసయ వర్గాల సమాచారం ప్రకారం బిజెపి జనసేన కూటమికి 60 అసెంబ్లీ స్థానాలు, పది పార్లమెంటు స్థానాలు ఇవ్వాలని అమిత్ షా చంద్రబాబు నాయుడుకి షరతు విధించారని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే టిడిపికి ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తినట్టే.. “జనసేన, టిడిపి కలిసి పోటీ చేస్తే బాగుండేది. మధ్యలో బిజెపితో పొత్తు కుదుర్చుకోవడం ఎందుకు? దీనివల్ల కీలకమైన ప్రాంతాల్లో సీట్లు ఇతర పార్టీల వారికి ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు అంత సులభంగా పార్టీ ఓటు బ్యాంకు బదిలీ కాదు. అది అంతిమంగా జగన్మోహన్ రెడ్డి పార్టీకి లాభం చేకూర్చుతుందని” టిడిపి కార్యకర్తలు అంతర్గతంగా అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి బిజెపి నేతలతో చర్చల కంటే ముందు పవన్ కళ్యాణ్ ను మాయ చేసి చంద్రబాబు నాయుడు అన్ని సీట్లలో తన వారినే నిలుపుకుంటారని ప్రచారం జరిగింది. కానీ ఈ రెండు పార్టీల మధ్యలోకి బిజెపి రావడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. అంతేకాదు అమిత్ షా తో జరిగిన భేటీలో ఏం జరిగిందో చంద్రబాబు నాయుడు బయటికి పరిస్థితి నెలకొంది. మరో వైపు పవన్ కళ్యాణ్ కూడా పెద్దగా ఏం మాట్లాడటం లేదు.
మార్చి మొదటి వారంలో ఏపీలో ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశాలున్నాయి. పట్టుమని పదిమంది అభ్యర్థులను ప్రకటించలేని దుస్థితిలో టిడిపి, జనసేన కూటమి ఉన్నది. బిజెపి నాయకులతో చర్చల తప్ప పొత్తు కుదరడం లేదు. పొత్తు కుదుర్చుకుంటే తప్ప చంద్రబాబు నాయుడు ఎన్నికల్లోకి వెళ్ళలేని పరిస్థితి.. అలాంటప్పుడు సీట్ల కేటాయింపు ఎప్పుడు జరుపుతారు? ఎవరికి సీట్లు ఇస్తారు? ఈ సస్పెన్స్ కు ఎప్పుడు తెరదించుతారు? అనే ప్రశ్నలు టిడిపి కేడర్ నుంచి ఉత్పన్నమవుతున్నాయి. జనసేన కేడర్ కు అంతకుముందే పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పడంతో ఆయనకు ఇటువంటి ఇబ్బంది లేదు. ఎటొచ్చీ చంద్రబాబు నాయుడే ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.