మట్టెవాడ సీఐ సస్పెన్షన్
వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మరో అధికారిపై వేటు పడింది.తాజాగా మట్టెవాడ ఇన్స్‌పెక్టర్ సీహెచ్.రమేష్‌ను సస్పెండ్ చేస్తూ గురువారం సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.మట్టెవాడ ఠాణా పరిధిలోని ఒక స్థలం విషయంలో కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించి బాధితులకు వ్యతిరేకంగా వ్యవహరించారన్న ఆరోపణలపై వేటు పడింది. అప్పటి ఏసీపీ గిరికుమార్ సూచనలతో ముందుకెళ్లిన సీఐ సస్పెన్షన్‌కు గురయ్యాడు.
ములుగు రోడ్డు సమీపంలోని దత్తక్షేత్రం వద్ద శ్రీరాంరెడ్డి, జయశ్రీ ఇద్దరి మధ్య భూతగాదా కోర్టు పరిధిలో ఉంది. 2019లో కోర్టు జయశ్రీకి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. తీర్పుపై ఆమె అప్పీలుకు వెళ్లారు. అప్పీల్ కేసు నడుస్తుండగానే మూడు గదుల ఇంటి నిర్మాణానికి బల్దియా జయశ్రీకి అనుమతులు ఇచ్చింది. నిర్మాణం చేస్తుండగా శ్రీరాంరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే విషయమే జయశ్రీ మట్టెవాడ అప్పటి ఏసీపీ గిరికుమార్, సీఐని కలిసి ఫిర్యాదు చేశారు. ఏసీపీ సూచనల మేరకు జీడబ్ల్యూఎంసీ అనుమతి పత్రాల ఆధారంగా జయశ్రీకే పోలీసులు మద్దతు తెలిపి శ్రీరాంరెడ్డిని హనుమకొండ తహసీల్దారు వద్ద బైండోవర్ చేశారు. అప్పటికే కోర్టు జయశ్రీ పత్రాల్లో పేర్కొన్న సర్వేనెంబర్, అనుభవిస్తున్న సర్వే నెంబర్ వేర్వేరని 2019లో వెల్లడించినప్పటికీ జీడబ్ల్యూఎంసీ అనుమతి పత్రాల పేరుతో శ్రీరాంరెడ్డితో ఏసీపీ తనదైన శైలిలో మాట్లాడారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నా పోలీసులు, జీడబ్ల్యూఎంసీ ఉద్యోగులు జయశ్రీ వైపు మొగ్గుచూపడటంతో శ్రీరాంరెడ్డి హైకోర్టును ఆశ్రయించి అనుకూలంగా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఇదే విషయాన్ని ఆధారాలతో సహ సీపీకి వినతి పత్రం ఇచ్చారు. సీపీ వెంటనే మున్సిపల్ కమిషనర్‌తో మాట్లాడి ఇంటి నిర్మాణ అనుమతుల పై ఆరా తీశారు. విచారించిన సీపీ సీఐను సస్పెన్షన్ చేశారు.
*జీడబ్ల్యూఎంసీ అధికారులకు ఉచ్చు:* మహానగర పాలక సంస్థ ఇచ్చిన పత్రాలకు వత్తాసు పలికినందుకే సీఐ సస్పెండ్ అయ్యారు. ఇక్కడ కార్పొరేషన్ అధికారుల తప్పిదం బయటపడింది. పోలీసు శాఖ చర్యలు తీసుకుంది. కార్పొరేషన్ అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సిందే.