ఉపాధి హామీ పథకాన్ని రాష్ర్టాలూ మోయాలి
వేతనాల భారాన్ని 40 శాతం భరించాలి
ఆధార్ ఆధారిత ఖాతాలోనే కూలీల వేతనం
కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్ వెల్లడి
ఈ ప్రతిపాదనలు అత్యంత ప్రమాదకరం
57% కూలీలు పనులకు దూరమవుతారు
విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తల ఆందోళన.
కరువు కాటకాలలో, అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంత జనాభాకు ఉపాధి కల్పిస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్)ను పూర్తిగా నీరుగార్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే బడ్జెట్‌లో ఈ పథకానికి నిధుల కేటాయింపును మూడింట ఒకవంతు తగ్గించిన కేంద్రం.. కొత్త నిబంధనల పేరుతో కూలీల సంఖ్యను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నది. కూలీల వేతనాలకు అయ్యే ఆర్థిక భారాన్ని రాష్ర్టాలు కూడా పంచుకోవాలంటూ కొత్తగా ప్రతిపాదించింది. ఇక కూలీలకు చేసే చెల్లింపులు ఇకపై ఆధార్ ఆధారంగానే ఉండాలని మరో మెలిక పెడుతున్నది. ఈ చర్యలతో ప్రస్తుతం ఈ పథకం ద్వారా ఉపాధి పొందుతున్న వారిలో 57శాతం మంది రోడ్డున పడతారని విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్ గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకంలో అవినీతిని నియంత్రించేందుకుగాను కూలీలకు ఇచ్చే వేతనాలలో 40 శాతం రాష్ర్టాలు భరించాలని పేర్కొన్నారు. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ను నిరంతర ఉపాధి పథకంగా పరిగణించరాదని చెప్పారు. ఎక్కడా పని దొరకని వారికి తాత్కాలికంగా పని కల్పించేందుకే ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. కూలీలకు ఇచ్చే వేతనాలను ప్రస్తుతం 100 శాతం కేంద్రమే భరిస్తున్నదని, దీనిని కేంద్రం, రాష్ర్టాల మధ్య 60:40 నిష్పత్తిలో పంచుకొనే విధంగా చట్టాన్ని సవరించాలని చెప్పారు.
ఆధార్ లింక్ తప్పనిసరి
ఉపాధి హామీ చట్టం ప్రకారం.. పని పూర్తయిన 15 రోజుల వ్యవధిలో కేంద్రమే నేరుగా కూలీల ఖాతాల్లో వేయడం ద్వారా వేతనాలను చెల్లిస్తున్నది. ఈ చెల్లింపుల విధానాన్ని మారుస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ గత నెల 30న ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఉపాధి కూలీకి ఆధార్‌తో అనుసంధానమై ఉన్న బ్యాంకు ఖాతాకు మాత్రమే అతని వేతనం పంపుతారు. ఇది అత్యంత ప్రమాదకరమని సామాజిక కార్యకర్తలు నిఖిల్ డే, యోగేంద్ర యాదవ్, జాన్ డ్రీజ్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘కొత్త నిబంధన ప్రకారం.. ఉపాధి హామీ కూలీ తన జాబ్ కార్డును, బ్యాంక్ ఖాతాను ఆధార్‌తోనే కాకుండా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కూడా అనుసంధానం చేయాలి. ఈ ప్రక్రియ అత్యంత గందరగోళంగా మారుతుంది’ అని జాన్ డ్రీజ్ పేర్కొన్నారు.
అత్యంత క్లిష్టంగా ఉండే ఈ ప్రక్రియ వల్ల కేవలం 47 శాతం మందికి మాత్రమే ఆధార్ ఆధారంగా వేతన చెల్లింపులు జరుగుతాయని నిఖిల్ డే తెలిపారు. మిగిలిన 57 శాతం మంది ఉపాధి పనులకు దూరమవుతారని పేర్కొన్నారు. ఇప్పటికే కూలీకి వచ్చే వారు మొబైల్ యాప్ ద్వారా తమ హాజరును నమోదు చేయాలని కేంద్రం మెలిక పెట్టిందని, ఇక ఆధార్ ఆధారంగా వేతనాలు చెల్లించాలన్న నిబంధనతో పథకం నీరుగారడం ఖాయమని అన్నారు. తాము కొత్తగా ప్రతిపాదించే నిబంధనల వల్ల ఉపాధి కూలీలు సగానికి పైగా తగ్గిపోతారన్న ముందుచూపుతోనే కేంద్రం బడ్జెట్ కేటాయింపులను 33% తగ్గించిందని తెలిపారు.
డిజిటల్ హాజరును తొలగించాలి
డిజిటల్ అటెండెన్స్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, రోజంతా పనిచేసినా ఆబ్సెంట్ అని నమోదవ్వడంతో వేతనం కోల్పోతున్నామని ఉపాధి హామీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టారు. ఎన్‌ఆర్‌ఈజీఏ సంఘర్ష మోర్చా ఆధ్వర్యంలో ప్రారంభించిన తమ నిరసనను వంద రోజుల పాటు కొనసాగిస్తామని చెప్పారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఏడాదికి కనీసం వంద రోజుల పాటు ఉపాధి కల్పించాలన్న ధ్యేయంతో కేంద్రం ప్రవేశపెట్టిన ఈ పథకంలో కార్మికుల హాజరు నమోదుకు స్మార్ట్ ఫోన్‌లోని ఎన్‌ఎంఎంఎస్ యాప్‌ను వినియోగిస్తున్నారు. అయితే చాలా గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్ సరిగ్గా లేకపోవడంతో కార్మికులు రోజంతా పనిచేసినా గైర్హాజరు కింద చూపుతుండటంతో వారికి వేతనాలు అందడం లేదు. దీనిపై మండిపడుతూ వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన కార్మికులు నిరసన చేపట్టారు. గతం లో లాగే తమకు వంద రోజుల పనిదినాలు కల్పించాలని, ప్రతివారం చెల్లింపు లు చేయాలని, ఎన్‌ఎంఎంఎస్ యాప్ హాజరు నమోదు నిబంధనను తొలగించాలని డిమాండ్ చేశారు.