నెల్లూరు వైసీపీలో మరో ఇద్దరు అసంతృప్త ఎమ్మెల్యేలు ? చంద్రబాబు మైండ్ గేమ్ !

నెల్లూరు వైసీపీలో మరో ఇద్దరు అసంతృప్త ఎమ్మెల్యేలు ? చంద్రబాబు మైండ్ గేమ్ !

నెల్లూరు : ఏపీలో తాజాగా జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు సొంత పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రత్యర్ధి పార్టీ టీడీపీ నిలబెట్టిన అభ్యర్ధి పంచుమర్తి అనురాధకు ఓటేశారు. వీరిలో ముగ్గురు నెల్లూరు జిల్లా వారే. అదీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే. దీంతో అధికార వైసీపీకి రెడ్లు వ్యతిరేకం అవుతున్నారంటూ పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో నెల్లూరులో మారిన రాజకీయ పరిస్ధితులు వైసీపీ అధిష్టానాన్ని కలవరపెడుతున్నాయి.

ఈ తరుణంలో నెల్లూరు జిల్లాకు చెందిన మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. వీరిలో కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డితో పాటు ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఉన్నట్లు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. జిల్లాలో మారుతున్న పరిస్ధితులతో పాటు జగన్ పై అసంతృప్తితో వీరిద్దరూ పక్కచూపులు చూస్తున్నట్లు ఈ ప్రచారాల సారాంశం. దీనిపై ఆయా ఎమ్మెల్యేలు స్పందించారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నామనే వార్తా కథనాలన్నీ దుష్ప్రచారం మాత్రమేనని మేకపాటి విక్రమ్ రెడ్డి నిన్న క్లారిటీ ఇచ్చారు. సీఎం వైఎస్ జగన్ అడుగుల్లోనే తమ ప్రతి అడుగు అని ఆయన స్పష్టం చేశారు. "వైఎస్ - మేకపాటి" కుటుంబాల అనుబంధం తెలుగు రాష్ట్రాలకు తెలుసని విక్రమ్ రెడ్డి తెలిపారు. వైఎస్ జగన్- దివంగత మేకపాటి గౌతమ్ ల స్నేహం ప్రత్యేకం అన్నారు. ఇదే క్రమంలో పార్టీ మార్పు ప్రచారం ఎదుర్కొంటున్న మరో ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కూడా స్పందించారు.

తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం చంద్రబాబు మైండ్ గేమ్ లో భాగమని కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వెల్లడించారు.తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదన్నారు. సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు చేస్తున్నారని ప్రసన్న మండిపడ్డారు. చివరి రక్తపు బొట్టు వరకూ జగన్ తోనే ఉంటానని పేర్కొన్నారు. తాను చనిపోయినా కుమారుడు రంజిత్ రెడ్డి జగన్ తోనే ఉంటారంటూ నల్లపురెడ్డి భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు.