వైఎస్ షర్మిలకు రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు |BSR NEWS|

వైఎస్ షర్మిలకు రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు |BSR NEWS|

పోలీసులపై దాడి కేసులో వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిలకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది.  మే 8 వరకు రిమాండ్ విధించింది. షర్మిలను పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు.

నాంపల్లి కోర్టులో ఇరు వర్గాల తరపున వాడివేడి వాదనలు జరిగాయి. సిట్ ఆఫీస్ కు వెళ్తున్న షర్మిలను ముందస్తు అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులపై షర్మిల దురుసుగా ప్రవర్తించిందని పోలీసుల తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. పోలీస్ అధికారులపై చెయ్యి కూడా చేసుకుందని కోర్టుకు చెప్పారు. కారుతో పోలీసులను గాయపరిచారని.. ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. షర్మిల ఒక కానిస్టేబుల్ చెంపపై కొట్టారని.. ఒక ఎస్సైతో దురుసుగా ప్రవర్తించి విధులకు ఆటంకం కల్గించారని కోర్టుకు వివరించారు. ముగ్గురిపై కేసు నమోదు చేశారని.. ఏ3 పరారీలో ఉన్నట్లు కోర్టుకు తెలిపారు పోలీసుల తరపు న్యాయవాది.

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసుపై సిట్ చీఫ్ ను కలవడానికి వెళ్తున్న షర్మిలను పోలీసులు అడ్డుకున్నారని కోర్టుకు తెలిపారు ఆమె తరపు న్యాయవాది.  షర్మిలను ప్రతిసారి టార్గెట్ చేస్తున్నారని..పోలీసులే షర్మిల పట్ల దురుసుగా ప్రవర్తించారని చెప్పారు.  41సీఆర్పీసీ నోటీసులు ఇవ్వకుండా షర్మిలను అక్రమంగా అరెస్ట్ చేశారని కోర్టుకు తెలిపారు. షర్మిలపై నమోదు చేసిన సెక్షన్స్ అన్ని ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులని చెప్పారు. అందుకే రిమాండ్ రిజెక్ట్ చేయాలని బెయిల్ పిటిషన్ కూడా వేస్తున్నామని తెలిపారు. మహిళ అని చూడకుండా పోలీసులు ఎక్కడపడితే అక్కడ టచ్ చేశారని కోర్టుకు చెప్పారు. షర్మిల దర్యాప్తునకు సహకరిస్తారని తెలిపారు.

4 సెక్షన్ల కింద కేసు నమోదు

ఇందిరాపార్క్ దగ్గర దీక్ష చేసేందుకు లోటస్ పాండ్ లోని పార్టీ ఆఫీస్ నుంచి బయటకు వెళ్తున్న షర్మిలను ఏప్రిల్ 24న ఉదయం అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే ఆమె వారిని నెట్టేశారు. దీంతో లోటస్‌ పాండ్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. రోడ్డుపై బైఠాయించిన షర్మిలను పోలీసులు అరెస్ట్‌ చేసి జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులతో అనుచితంగా ప్రవర్తించినందుకు షర్మిలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.  మహిళా కానిస్టేబుల్ తో  పాటుగా ఎస్ఐ రవీంద్రపై షర్మిల చేయిచేసుకున్నారు. దీనిని సీరియస్ గా తీసుకున్న పోలీసులు... షర్మిలపై 4  సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.