కాంగ్రెస్ కు 75 నుంచి 80 సీట్లు.. సునీల్ కనుగోలు తాజా నివేదిక

పోలింగ్ కు రెండు రోజుల ముందు తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ తారస్థాయికి చేరింది.ఇదుకు కాంగ్రెస్ వ్యూహకర్త ఎన్నికలలో కాంగ్రెస్ విజయంపై ఇచ్చిన తాజా నివేదికే కారణం. అంతకు ముందు నాలుగు రోజులుగా తెలంగాణలో తన వ్యూహాలు సరిగా అమలు కావడం లేదనీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనీ సునీల్ కనుగోలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారనీ, తెలంగాణలో విజయం కోసం తానిక పని చేయబోననీ, తన బృందంతో సహా బెంగళూరుకు వెళ్లిపోతున్నాననీ పార్టీ హైకమాండ్ కు లేఖ రాశారనీ, ఇదే విషయాన్ని ఆయన తెలంగాణ సీనియర్లతో కూడా పంచుకున్నారనీ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో సరిగ్గా ఎన్నికల వేళ, కాంగ్రెస్ లో ఇదేం ట్విస్ట్ అని పరిశీలకులు సైతం విస్మయం చెందారు. సునీల్ కనుగోలు అసంతృప్తిపై సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో కాంగ్రెస్ శిబిరంలోనూ ఒకింత గాభరా కనిపించింది. అయితే వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేస్తూ సునీల్ కనుగోలు కాంగ్రెస్ లో నూతనోత్సాహం నింపే నివేదికను వెల్లడించారు.
సునీల్ కనుగోలు నివేదిక మేరకు ఈ ఎన్నికలలో కాంగ్రెస్ సంపూర్ణ మెజారిటీతో అధికారాన్ని జేజిక్కించుకోవడం ఖాయం. ఆయన అంచనా ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్ 75 నుంచి 80 స్థానాలలో విజయం సాధిస్తుంది. తెలంగాణ ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన కర్నాటక సీఎం సిద్ధరామయ్యతో కూడా సునీల్ కనుగోలు ఇదే విషయాన్ని చెప్పినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా ఆదివారం (నవంబర్ 28) రాష్ట్రంలో పర్యటించిన సిద్దరామయ్యతో సునీల్ కనుగోలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎన్నికలు, ఫలితాలపై తన తాజా రిపోర్టులతో పాటు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అంశాలు, ఆరుగ్యారంటీలపై ప్రజలలో ఏర్పడిన విశ్వాసం తదితర అంశాలకు కూడా వివరించినట్లు పార్టీ వర్గాులు చెబుతున్నాయి.
ఈ సందర్భంగా వారిరువురి మధ్యా సెగ్మంట్ ల వారీగా జయాపజయాలు, ఓట్ల శాతం తదితర అంశాలపై చర్చ జరిగినట్లు చెబుతున్నారు. ఎన్నికలకు నాలుగు రోజుల ముందుగానే సిద్దరామయ్య పార్టీ క్యాడర్ కు, నాయకులకు గ్రీటింగ్స్ చెప్పారు. ఈ సారి తెలంగాణలో కాంగ్రెస్ దే అధికారమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఎన్నికల తరువాత కాంగ్రెస్ టాస్క్ దేశంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడమేనని ఆయన వ్యాఖ్యనించారు. కర్నాటకలో కాంగ్రెస్ విజయంతో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ హవా సాగుతోందన్నారు. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికలలో కాంగ్రెస్ విజయభేరి మోగించడం తథ్యమని ధీమా వ్యక్తం చేసిన సిదర్ధరామయ్య ఆ తరువాత సార్వత్రిక ఎన్నికలలోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతుందనీ, కేంద్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.