పరీక్ష రాయాలంటే మంగళసూత్రం తీసేయాల్సిందేనట

పరీక్ష రాయాలంటే మంగళసూత్రం తీసేయాల్సిందేనట

BSR NEWS

  • కర్ణాటకలో రైల్వే నియామక పరీక్షకు వివాదాస్పద నియమం
  • రైల్వే అధికారుల తీరుపై మండిపడ్డ వీహెచ్ పీ
  • విమర్శలు వెల్లువెత్తడంతో వెనక్కి తగ్గిన రైల్వే అధికారులు

కర్ణాటకలో రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మంగళసూత్రం సహా ఎలాంటి ఆభరణాలతో వచ్చినా పరీక్ష హాల్ లోకి అనుమతించబోమని అధికారులు చెప్పారు. ఈమేరకు నియామక పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్ పై స్పష్టంగా పేర్కొన్నారు. ఈ వివాదాస్పద నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది. వివాహిత స్త్రీలు ఎంతో పవిత్రంగా భావించే మంగళసూత్రాన్ని తొలగించాలనడంపై విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వీహెచ్ పీతో పాటు పలు హిందూ సంస్థలు సైతం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించాయి. హిందూ సంఘాలు ఆందోళనలు చేపట్టడంతో చివరకు రైల్వే అధికారులు వెనక్కి తగ్గి, ఆ వివాదాస్పద నిబంధనను తొలగించారు.

వివరాల్లోకి వెళితే.. రైల్వే శాఖలో నర్సింగ్‌‌ సూపరింటెండెంట్‌‌ పోస్టుల భర్తీకి అధికారులు ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులకు హాల్ టికెట్లు కూడా పంపించారు. అయితే, పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు మంగళసూత్రం, చెవిపోగులు, ముక్కుపుడకలు, ఉంగరాలు, కంకణాలు, జంధ్యం వంటి చిహ్నాలు సహా ఎలాంటి ఆభరణాలు ధరించకూడదని హాల్‌‌టికెట్లపై పేర్కొన్నారు. దీనిపై వీహెచ్ పీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. మత స్వేచ్ఛను ఉల్లంఘిస్తూ తీసుకున్న ఈ నిర్ణయం కోట్లాదిమంది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హిందువులు అధికంగా ఉన్న మన దేశంలో ఇలాంటి విధానాలను అంగీకరించేది లేదని పేర్కొంటూ బెంగళూరులో ఆందోళన చేపట్టారు. హాల్‌‌ టికెట్లపై పేర్కొన్న కండిషన్లను వాపస్‌‌ తీస్కోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌‌‌‌తో పాటు పలువురు ఎంపీలకు వీహెచ్‌‌పీ వినతి పత్రాలు సమర్పించింది. మత విశ్వాసాలకు సంబంధించిన చిహ్నాలను తొలగించాలని ప్రజలను కోరడం ఆమోదయోగ్యం కాదని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌‌‌‌ కూడా విమర్శించారు. వీహెచ్‌‌పీ నిరసనల అనంతరం రైల్వే శాఖ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది.