రాహుల్ గాంధీపై పరువునష్టం కేసు పెడతారా? అంటే ప్రీతి జింటా ఏమన్నారంటే..!

- BSR NEWS
- రాజకీయ ఎంట్రీపై స్పందించిన మాజీ నటి
- రాజ్యసభకు పంపిస్తామని పిలిచినా అంగీకరించలేదని వివరణ
- రాజకీయాలు తనకు సరిపడవని నో చెప్పినట్లు వెల్లడి
- ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఆరోపణలపైనా స్పందించిన ప్రీతి జింటా
సినీ రంగంలో ఓ వెలుగు వెలిగిన నటులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. నటసార్వభౌముడిగా ప్రఖ్యాతి నొందిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని నెలకొల్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలందించిన విషయం తెలిసిందే. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ పలువురు సినీ నటులు రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ నటి, వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకున్న ప్రీతి జింటాను ఓ అభిమాని ఇదే ప్రశ్న అడిగాడు.
తాజాగా సోషల్ మీడియా వేదికగా ప్రీతి జింటా తన అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రీతిని రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా? అని అభిమాని ప్రశ్నించాడు. దీనికి జవాబిస్తూ చాలా రాజకీయ పార్టీలు తనకు పార్టీ టికెట్ ఆఫర్ చేశాయని ప్రీతి చెప్పారు. రాజ్యసభకు పంపిస్తామని కూడా ఆఫర్ ఇచ్చినా తాను అంగీకరించలేదన్నారు. రాజకీయాలు తనకు సరిపడవనే ఉద్దేశంతో పాటు ఆసక్తి లేక అటువైపు వెళ్లలేదని వివరించారు.
ప్రస్తుతం సోషల్ మీడియా అత్యంత విషపూరితంగా మారిందని ప్రీతి జింటా వ్యాఖ్యానించారు. ‘ఎవరు ఏం మాట్లాడినా కూడా దానికి రాజకీయ రంగు పులుముతున్నారు. ప్రతీ కామెంట్ నూ రాజకీయాలతో ముడిపెడుతున్నారు. నేను సున్నితమైన భావాలు కలిగిన సాధారణ మహిళను మాత్రమే. రాజకీయాలతో నాకు సంబంధం లేదు, వాటిపై ఆసక్తీ లేదు’ అని ప్రీతి చెప్పారు. ఇటీవల ముంబైలోని న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ లోన్ విషయంపై రేగిన వివాదంపైనా ప్రీతి స్పందించారు. ఈ బ్యాంకు నుంచి ప్రీతి గతంలో రూ.18 కోట్ల రుణం తీసుకున్నారు. ప్రీతి తన సోషల్ మీడియా ఖాతాలను బీజేపీకి అప్పగించిందని, ప్రతిఫలంగా ఈ లోన్ ను బ్యాంకు మాఫీ చేసిందని కేరళ కాంగ్రెస్ ఆరోపించింది.
ఈ ఆరోపణలపై ప్రీతి మండిపడ్డారు. తాను ఆ లోన్ ను ఎప్పుడో తీర్చేశానని, తన సోషల్ మీడియా ఖాతాలను తానే నిర్వహిస్తానని వివరణ ఇచ్చారు. ఈ విషయంలో రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు దాఖలు చేయాలంటూ మరో అభిమాని సూచించగా.. కేరళ కాంగ్రెస్ లో ఎవరో ఒకరు చేసిన పనికి రాహుల్ గాంధీని బాధ్యుడిగా చేయాలనే ఉద్దేశం తనకు లేదని ప్రీతి జవాబిచ్చారు. రాహుల్ గాంధీతో తనకు ఎలాంటి సమస్య లేదని, ఆయనపై ఎలాంటి కేసు వేసే ఆలోచన తనకు లేదని ప్రీతి జింటా స్పష్టం చేశారు.