డాలర్ డ్రీమ్స్.. డంకీ రూట్ లో భారతీయుడి మృతి

డాలర్ డ్రీమ్స్ తో అక్రమ మార్గంలో అమెరికాకు వెళ్లేందుకు ప్రయత్నించి మరో భారతీయుడు మృత్యువాత పడ్డారు. కుటుంబంతో పాటు డంకీ రూట్ లో ప్రయాణిస్తూ నికరగ్వాలో అనారోగ్యంపాలై చనిపోయాడు. ఆయన భార్యాపిల్లలు అక్కడే చిక్కుకుపోయారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో చనిపోయింది గుజరాత్ కు చెందిన దిలీప్ పటేల్ గా అధికారులు గుర్తించారు.
సబర్‌కాంతా జిల్లాలోని మోయద్ గ్రామానికి చెందిన దిలీప్ పటేల్ అమెరికాలో స్థిరపడాలనే కోరికతో ఓ ఏజెంట్‌ను సంప్రదించాడు. భార్యబిడ్డలతో అమెరికా చేర్చడానికి ఏజెంట్ రూ.కోటి డిమాండ్ చేయగా.. భూమిని అమ్మి డబ్బులు చెల్లించారని గ్రామస్థులు చెప్పారు. డబ్బులు అందుకున్న తర్వాత ఏజెంట్లు దిలిప్ కుటుంబాన్ని తొలుత దుబాయ్ కి, అక్కడి నుంచి నికరగ్వాకు తీసుకెళ్లారు.
అక్కడి నుంచి డంకీ మార్గంలో అమెరికాలోకి ప్రవేశించే క్రమంలో దిలీప్ అనారోగ్యానికి గురయ్యాడు. మధుమేహంతో బాధపడుతున్న దిలీప్ కు సరైన మందులు దొరకకపోవడంతో పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు. దిలీప్ మరణంతో ఆయన భార్యాబిడ్డలు నికరగ్వాలో చిక్కుకుపోయారు. విదేశాంగ శాఖ స్పందించి దిలీప్ మృతదేహాన్ని, ఆయన భార్యాబిడ్డలను గుజరాత్ కు తీసుకురావాలని గ్రామస్థులు కోరుతున్నారు.