YCP: ‘సిద్ధం’ పొలిటికల్ రియాక్షన్!

సాధారణంగా ఇటీవల వైసిపి ఎటువంటి కార్యక్రమం చేపట్టినా హోర్డింగులతో ప్రచారం చేసుకోవడం పరిపాటిగా మారింది. చివరకుపాన్ షాపులకు సైతం ‘జగనన్న నువ్వే మా నమ్మకం’ హోర్డింగులను బలవంతంగా వేలాడదీస్తున్నారన్న విమర్శ ఉంది.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి. చంద్రబాబు గత నెల నుంచే రా కదలిరా పేరుతో ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. అతి సీఎం జగన్ సైతం ‘సిద్ధం’ పేరుతో ప్రచార సభలు ప్రారంభించారు. తొలి సభను విశాఖ జిల్లా భీమిలిలో ఏర్పాటు చేశారు. రెండో సభను ఏలూరులో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల నాలుగు నుంచి పవన్ కళ్యాణ్ సైతం ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనున్నారు. దీంతో అన్ని పార్టీల్లో ఒక రకమైన వాతావరణం కనిపిస్తోంది. అయితే వైసిపి చేపడుతున్న సిద్ధం స్లోగన్ బలంగా వెళుతోంది. రాజకీయ పార్టీల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లకు కారణమవుతోంది.
సాధారణంగా ఇటీవల వైసిపి ఎటువంటి కార్యక్రమం చేపట్టినా హోర్డింగులతో ప్రచారం చేసుకోవడం పరిపాటిగా మారింది. చివరకుపాన్ షాపులకు సైతం ‘జగనన్న నువ్వే మా నమ్మకం’ హోర్డింగులను బలవంతంగా వేలాడదీస్తున్నారన్న విమర్శ ఉంది. ఇప్పుడు సిద్ధం పేరిట భారీ హోర్డింగులు రాష్ట్రవ్యాప్తంగా వెలుస్తున్నాయి. అయితే విజయవాడలో సిద్ధం హోర్డింగ్ పెను సంచలనాలకు కారణమైంది. ఈ హోర్డింగ్ పక్కనే జనసేన భారీ హోర్డింగును ఏర్పాటు చేసింది. పవన్ ఫోటోతో మేం సిద్ధం అంటూ సవాల్ చేస్తూ హోర్డింగ్ ఉంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ సైతం చంద్రబాబు ఫోటోతో సంసిద్ధం అంటూ హోర్డింగ్ ను ఏర్పాటు చేసింది. దీంతో మూడు పార్టీల శ్రేణుల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో విజయవాడలో యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు స్పందించారు. ఆ హోర్డింగులను తొలగించడంతో వివాదం సద్దుమణిగింది.
అయితే సోషల్ మీడియాలో మూడు పార్టీల శ్రేణుల మధ్య పెద్ద గలాటా నడుస్తోంది. ఎన్నికలకు మేము సిద్ధం అంటూ వైసీపీ శ్రేణులు పోస్టింగ్ పెడుతుండగా.. ఓడిపోవడానికి మీరు సిద్ధంగా ఉండాలని టిడిపి, జనసేన శ్రేణులు కామెంట్స్ చేస్తున్నాయి. మేం సిద్ధం అంటూ జనసేన పెడుతున్న పోస్టులకు వైసిపి భిన్నంగా కామెంట్స్ పెడుతోంది. చంద్రబాబు పల్లకి మోయడానికి మీరు ఎప్పుడూ సిద్ధమే.. ప్యాకేజీ తీసుకోవడానికి మీరు ఎప్పుడూ సిద్ధమే అంటూ వైసీపీ శ్రేణులు ఎగతాళి చేస్తున్నాయి. సంసిద్ధం అంటూ టిడిపి పెట్టిన పోస్టులపై సైతం వైసీపీ శ్రేణులు కామెంట్స్ చేస్తున్నాయి. పవన్ సహకారంతో గట్టెక్కేందుకు మీరు సంసిద్ధం అంటూ కామెంట్లు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికైతే వైసీపీ సిద్ధం స్లోగన్ మూడు పార్టీల మధ్య వైరంగా మారడం విశేషం. ఎన్నికలు సమీపిస్తున్న కొలది ఈ యుద్ధ వాతావరణం మరింత ముదరనుంది.