YS Sharmila: కుటుంబంలో చీలికకు జగనే కారణం.. షర్మిల సంచలన వ్యాఖ్యలు

కాకినాడ పర్యటనలో భాగంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం తో పాటు వైఎస్ కుటుంబంలో చీలికకు కాంగ్రెస్ పార్టీ కారణమని జగన్ వ్యాఖ్యానించారు. దీనిపై మాట్లాడిన షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు
YS Sharmila: వైఎస్ షర్మిల డోసు పెంచారు. పిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం ఆమె వైసీపీని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. రోజురోజుకు ఆమె విమర్శల డోసు పెంచుతున్నారు. సోదరుడు జగన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. తన కుటుంబంలో చీలికకు కాంగ్రెస్ పార్టీ కారణమని జగన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై షర్మిల స్పందించారు. వైఎస్ కుటుంబంలో చీలికకు ముమ్మాటికి జగనే కారణమని ఆరోపణలు చేశారు. వసుదైక కుటుంబాన్ని చేజేతులా చీలిక తీసుకొచ్చినది జగనేనని ఆరోపించారు. జిల్లాల పర్యటనలో ఉన్న ఆమె.. రోజుకో తరహాలో విమర్శలు చేయడం గమనార్హం. జగన్ తో పాటు వైసీపీ నేతల ఆరోపణలను షర్మిల తిప్పి కొడుతున్నారు. దీంతో ఇవి రాజకీయంగా సంచలనంగా మారుతున్నాయి.కాకినాడ పర్యటనలో భాగంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం తో పాటు వైఎస్ కుటుంబంలో చీలికకు కాంగ్రెస్ పార్టీ కారణమని జగన్ వ్యాఖ్యానించారు. దీనిపై మాట్లాడిన షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. వైఎస్ కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పట్లో రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను మంత్రులను చేస్తానని చెప్పిన జగన్ మాట మార్చారని విమర్శించారు. పార్టీ కోసం సుదీర్ఘంగా 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇంటిని, పిల్లలను పక్కన పెట్టి ఎండనక, వాననక రోడ్లపై తిరిగానని.. జగన్ సీఎం అయ్యేందుకు కష్టపడ్డానని.. అటువంటి తనకు సీఎం అయిన రోజు నుండి పక్కన పెట్టిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం షర్మిల కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి శ్వాస కాంగ్రెస్. రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలన్న ఆశయంతో రాజశేఖర్ రెడ్డి పనిచేశారు. కానీ జగన్ బిజెపికి బానిసగా మారారు. ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు లేకున్నా ఏపీలో బిజెపి రాజ్యమేలుతోందని.. రాష్ట్ర అభివృద్ధికి సహకరించని బిజెపికి ఎందుకు జగన్ దాసోహం అయ్యారని షర్మిల ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం ఏనాడైనా పోరాటం చేశారా అని జగన్ ను నిలదీశారు. కనీసం పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడింది లేదని.. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని దేశంలో నిలబెట్టారని.. చివరకు విశాఖ స్టీల్ ప్లాంటును బిజెపికి పణంగా పెట్టారని ఆరోపణలు చేశారు. జగన్ సీఎం అయ్యేందుకు లక్షల మంది పరితపించారని.. కానీ అధికారంలోకి వచ్చాక వారిని జగన్ పక్కన పడేశారని షర్మిల ఆరోపించారు. తమ కుటుంబంలో చీలికకు జగన్ కారణమని.. ఆ నెపాన్ని కాంగ్రెస్ పార్టీపై వేస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే విభజన హామీలతో పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కేటాయిస్తూ రాహుల్ గాంధీ తొలి ఫైల్ పై సంతకం చేస్తారని షర్మిల స్పష్టం చేశారు. మొత్తానికి అయితే వైసీపీ నుంచి అధినేత జగన్ వరకు అందరి పైన షర్మిల విరుచుకుపడుతున్నారు. వైసిపి వైఫల్యాలపై మాట్లాడుతునే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. మున్ముందు షర్మిల మాటల దాడి పెంచే అవకాశం ఉంది. దీంతో అధికార శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.