ఏపీ గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం
ఏపీ గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం
*|| BSR NEWS...✒️ ||*
*ఏపీ గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం*
ఏపీ గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేశారు.ఈ సందర్భంగా హైకోర్ట్ చీఫ్ జస్టిస్ పీకే మిశ్రా ఆయన చేత ప్రమాణం చేయించారు.ఈ కార్యక్రమానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి దంపతులు, మంత్రులు, న్యాయమూర్తులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం తర్వాత రాజ్ భవన్ లో హై టీ కార్యక్రమం నిర్వహించారు. విజయవాడలోని రాజ్ భవన్లో ఈ కార్యక్రమం జరిగింది. ప్రమాణస్వీకారం అనంతరం నేతలు, అధికారులు గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే.. జస్టిస్ అబ్దుల్ నజీర్ గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. బిశ్వభూషణ్ హరిచందన్ స్థానంలో జస్టిస్ అబ్దుల్ నజీర్ ఏపీ గవర్నర్ గా నియమితులయ్యారు.1958 జనవరి 5న కర్ణాటకలోని మూడబిదరి తాలూకా బెలువాయిలో జన్మించారు. బాల్యం అంతా మూడబిదరిలోనే సాగింది. అక్కడి మహావీర కళాశాలలో బీకాం చేసిన ఆయన, మంగళూరు కొడియాల్బెయిల్ ఎస్ఓఎం లా కళాశాలలో న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తిచేశారు. 1983 ఫిబ్రవరి 18న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకొని కర్ణాటక హైకోర్టులో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 2003 మే 12న కర్ణాటక హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2004 సెప్టెంబర్ 24న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2017 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులై ఈ ఏడాది జనవరి నాలుగో తేదీ వరకు సర్వోన్నత న్యాయస్థానంలో సేవలందించారు. పదవీ విరమణ తర్వాత ఆయనకు గవర్నర్ పదవి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఏపీ గవర్నర్ గా పనిచేసిన బిశ్వ భూషణ్ హరిచందన్ ఛత్తీస్ ఘడ్ గవర్నర్ గా బదిలీపై వెళ్లారు.
*|| BSR NEWS...✒️ ||*