దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రజా పంపిణీ వ్యవస్థ ను కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షించబడే విధానాన్ని ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.
వినియోగదారుల వ్యవహారాలు, ఆహార & పౌరసరఫరాల శాఖ ద్వారా రాష్ట్రంలోని రైతుల నుండి వారు పండించిన ధాన్యమును మద్దతు ధరకు సేకరించి బియ్యమును దానిని రైస్ మిల్లుల ద్వారా మిల్లింగు చేసి సదరు ప్రజా పంపిణీ వ్యవస్థ నందు మొబైల్ వాహనాల ద్వారా లబ్దిదారుల ఇంటి వద్దనే వారి సమక్షంలో తూకం చేసి ఇతర సరుకులతో పాటు పంపిణీ చేయడం జరుగుచున్నది. ఈ ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించడానికి మరియు లబ్దిదారులకు సకాలంలో సక్రమంగా నిత్యావసరాలు అందించడానికి చర్యలు తీసుకోవడం జరుగుచున్నది.
ఇందులో భాగంగా రాష్ట్రం నందు గల MLS గోడౌన్లను, రైస్ మిల్లులు, స్టేజి 1& 2. రవాణా, ధాన్యం సేకరణ మరియు ప్రజా పంపిణీ వ్యవస్థల నందు అక్రమాలకు పాల్పడకుండా పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయుటకు గాను రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార & పౌరసరఫరాల శాఖ ప్రధాన కార్యాలయము నందు రాష్ట్ర స్థాయి కమాండ్ కంట్రోల్ సెంటర్ ను నెలకొల్పడం జరిగినది. ఈ రాష్ట్ర స్థాయి కమాండ్ కంట్రోల్ సెంటర్ ను వినియోగదారుల వ్యవహారాలు, ఆహార & పౌరసరఫరాల శాఖ గౌ. మంత్రి వర్యులు, శ్రీ కారుమూరి వెంకట నాగేశ్వర రావు గారి చేతుల మీదుగా 08-02-2023 వ తేది ఉదయం 09:00 గంటలకు ప్రారంభించడం జరిగింది.
ఈ రాష్ట్ర స్థాయి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా రాష్ట్రం నందు గల అన్ని MLS గోడౌన్లను, రైస్ మిల్లులు, స్టేజి 1 & 2 రవాణా వాహనాల కదలికలను సంబంధిత వివరాలను అనుసంధానం చేసి ఒకే చోట నుండి ప్రత్యక్ష ప్రసారం ద్వారా మానిటర్ చేయడం జరుగుతుంది. ఇంకను మొబైల్ వాహనాల కదలిక మరియు ఇంటి వద్దనే బియ్యం మరియు నిత్యావసరాల సరుకుల పంపిణీ, అంగన్వాడి కేంద్రాలకు మరియు పాఠశాలలకు పంపిణీ చేయు సరుకులను పర్యవేక్షించడం జరుగుతుంది మరియు అన్ని మిల్లుల్లో CC కెమెరాలు ఏర్పాటు చేసి ధాన్యం మిల్లింగ్ చేయు కార్యకలాపాలను CC కెమెరాల ద్వారా ప్రత్యక్షంగా పర్యవేక్షించడం జరుగుతుంది. సదరు వ్యవస్థ ద్వారా ఏవైనా లోపాలను గుర్తించిన యెడల కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి సంబంధిత అధికారులను అప్రమత్తం చేసి అక్రమాలకు పాల్పడకుండా తగిన చర్యలు తీసుకోవడానికి దోహదపడుతుంది.
ఈ రాష్ట్ర స్థాయి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఆఫీస్ పనిదినములలో ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 06:00 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా మానిటర్ చేస్తూ MLS గోడౌన్లను, రైస్ మిల్లులు, స్టేజి 1 & 2 రవాణా, ధాన్యం సేకరణ మరియు ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించి ఎటువంటి అక్రమాలు జరుగకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
ఈరోజు కమాండ్ కంట్రోల్ సెంటర్ ను పర్యవేక్షించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ చిత్త విజయ్ ప్రతాప్ రెడ్డి గారు.