టికెట్ వెనుక ఆర్టీసీ కండక్టర్ రాసిన చిల్లర తీసుకోవడం మర్చిపోయారా?.. ఇలా చేస్తే తిరిగి పొందొచ్చు!

BSR5 NEWS
ఆర్టీసీ బస్సులో టికెట్ కు సరిపడా చిల్లర లేకుంటే పడే తిప్పలు అన్నీఇన్నీ కావు. దిగేటప్పుడు తీసుకొమ్మంటూ కండక్టర్ టికెట్ వెనుక రాసివ్వడం జరుగుతుంటుంది. గమ్యం చేరుకున్నాక చాలామంది హడావుడిగా బస్సు దిగి వెళ్లిపోతుంటారు. ఈ హడావుడిలో టికెట్ వెనుక రాసిన చిల్లర తీసుకోవడం మర్చిపోతుంటారు. ఇంటికి వెళ్లాక గుర్తొచ్చినా చేసేదేంలేక బాధపడుతుంటారు. అయితే, ఇకపై ఇలా డబ్బులు నష్టపోవాల్సిన అవసరం లేదని తెలంగాణ ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఎవరైనా చిల్లర తీసుకోవడం మర్చిపోతే ఆ టికెట్ పై ఉన్న హెల్ప్ లైన్ నెంబర్ 040-69440000కు సమాచారం ఇస్తే, విచారణ అనంతరం వారికి రావాల్సిన డబ్బులు ఫోన్‌పే చేస్తామని చెబుతున్నారు.
ఇలా చిల్లర డబ్బులు మాత్రమే కాదు, బస్సులో మర్చిపోయిన వస్తువులనూ తిరిగి పొందవచ్చని తెలిపారు. బస్సులో విలువైన వస్తువులు, బ్యాగులు, సెల్ ఫోన్లు, ఇతర వస్తువులు మర్చిపోతే హెల్ప్ లైన్ నెంబర్ కు సమాచారం అందించి వాటిని తిరిగి పొందవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు. అంతేకాదు, దూర ప్రయాణం చేసే సందర్భాలలో భోజనం కోసమో, టిఫిన్ కోసమో బస్సు మార్గమధ్యంలో ఆపడం తెలిసిందే. అయితే, భోజనం చేసి వచ్చే లోపు బస్సు వెళ్లిపోతే కూడా హెల్ప్ లైన్ నెంబర్ కు ఫిర్యాదు చేయొచ్చు. దీంతో అదే టికెట్ పై మరో బస్సులో గమ్యం చేరుకునేందుకు అధికారులు వెసులుబాటు కల్పిస్తారు. మొదటి బస్సులోని లగేజీని భద్రంగా అందజేస్తారు.