బాబు పవన్ కోసం కదిలొచ్చిన కుటుంబాలు.. జగన్ కు అదే మైనస్

బాబు పవన్ కోసం కదిలొచ్చిన కుటుంబాలు.. జగన్ కు అదే మైనస్

BSR NEWS

గత ఎన్నికల్లో జగన్ కు కుటుంబ సభ్యుల నుంచి అంతులేని మద్దతు లభించింది. తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల, ఇతర కుటుంబ సభ్యులు ప్రచారం చేశారు. మత ప్రచారకుడుగా ఉన్న బ్రదర్ అనిల్ కుమార్ కూడా ఇంటర్నల్ గా పని చేశారు.

AP Assembly Election Results 2024: ఏపీలో రికార్డ్ స్థాయిలో టిడిపి కూటమి ఘన విజయం సొంతం చేసుకుంది. కూటమి దాటికి ఫ్యాన్ రెక్కలు వీడాయి. ఆ ప్రాంతం, ఈ ప్రాంతం అన్న తేడా లేకుండా అన్నిచోట్ల టిడిపి కూటమి సునామీ సృష్టించింది. కూటమి ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్ళగా.. వైసీపీలో మాత్రం ఆ పరిస్థితి కనిపించలేదు. మూడు పార్టీల మధ్య సమన్వయం చక్కగా కుదిరింది. ప్రచార పర్వం సైతం ఒక వ్యూహం ప్రకారం తీసుకెళ్లారు. అయితే టిడిపికి నందమూరి కుటుంబం, జనసేనకు మెగా కుటుంబం అండగా నిలిచింది. కూటమికి సినీ గ్లామర్ పెంచింది. టిడిపికి మద్దతుగా అటు నారా కుటుంబంతో పాటు నందమూరి కుటుంబం ప్రచారం చేసింది. మెగా కుటుంబం నుంచి చిరంజీవి స్పష్టమైన సంకేతాలు పంపించగా.. ఇతర కుటుంబ సభ్యులు రంగంలోకి దిగారు. కానీ జగన్ కు మాత్రం ఆ స్థాయిలో కుటుంబం నుంచి మద్దతు లేదు.

గత ఎన్నికల్లో జగన్ కు కుటుంబ సభ్యుల నుంచి అంతులేని మద్దతు లభించింది. తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల, ఇతర కుటుంబ సభ్యులు ప్రచారం చేశారు. మత ప్రచారకుడుగా ఉన్న బ్రదర్ అనిల్ కుమార్ కూడా ఇంటర్నల్ గా పని చేశారు. వివేకానంద రెడ్డి కుమార్తె సునీత సైతం ప్రచారం చేశారు. కానీ ఎన్నికల్లో వారంతా దూరమయ్యారు. దాదాపు కుటుంబమంతా అడ్డగోలుగా చీలిపోయింది. షర్మిల ప్రత్యర్థిగా మారారు. వివేక హత్య కేసులో సునీత గట్టిగానే పోరాడుతున్నారు. సునీత తల్లి సౌభాగ్యమ్మ సైతం షర్మిలకు మద్దతుగా ప్రచారం చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్నికల్లో జగన్ ఒంటరివాడు అయ్యాడు.

అయితే గత అనుభవాల దృష్ట్యా చంద్రబాబుకు మద్దతుగా నందమూరి కుటుంబమంతా రంగంలోకి దిగింది. ఎన్టీఆర్ కుమారులతో పాటు సమీప బంధువులు వచ్చి ప్రచారం చేశారు. నారా చంద్రబాబు తమ్ముడు కుమారుడు నారా రోహిత్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. టిడిపి కూటమికి మద్దతుగా ప్రచారం చేశారు. మరోవైపు నందమూరి బాలకృష్ణ, లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి సైతం రంగంలోకి దిగారు.మెగా కుటుంబం నుంచి దాదాపు అందరూ హీరోలు ప్రచారం చేశారు. నాగబాబు ఇప్పటికే ప్రచారంలో ఉన్నారు. చిరంజీవి ప్రత్యేక వీడియో విడుదల చేశారు. పవన్ కు మద్దతు తెలపాలని చెప్పడం ద్వారా కూటమికి సపోర్ట్ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ తేజ్ నేరుగా ప్రచారం చేశారు. రామ్ చరణ్, ఆయన తల్లి, అల్లు అరవింద్ నేరుగా వెళ్లి మద్దతు ప్రకటించారు. అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలిపారు. ఇలా దాదాపు కుటుంబమంతా పవన్ కళ్యాణ్ తో పాటు కూటమికి మద్దతుగా ప్రచారం చేసింది. ఈ రెండు కుటుంబాలతో ప్రచారం హోరెత్తింది. కానీ జగన్ తరుపున ఆయన భార్య భారతి సొంత నియోజకవర్గం పులివెందులకు పరిమితం అయ్యారు. వైసిపికి ఇది లోటు. కుటుంబ మద్దతు లేదని ప్రచారానికి దోహద పడింది. ఓటమికి కారణం అయ్యింది.