ఢిల్లీ, ముంబై బీబీసీ కార్యాలయాల్లో 60 గంటల పాటు ఐటీ సోదాలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: బీబీసీ కార్యాలయాల్లో జరుగుతున్న ఐటీ సోదాలు గురువారం రాత్రి ముగిశాయి. ఢిల్లీ, ముంబైలోని ఆఫీసుల్లో మంగళవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన ఈ సోదాలు.. దాదాపు 60 గంటల పాటు కొనసాగాయి. సోదాల్లో భాగంగా అధికారులు బీబీసీ ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన డాటా కాపీలు తీసుకొన్నారు. సంస్థ ఆర్థిక లావాదేవీలు, ఇతర వివరాలపై ఉద్యోగులను ప్రశ్నించారు. సీనియర్‌ ఉద్యోగుల స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయడంతో పాటు పలు పత్రాలను స్వాధీనం చేసుకొన్నారు. అయితే సోదాల గురించి ఐటీ శాఖ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. సోదాల్లో భాగంగా పలువురు ఉద్యోగులను మూడు రోజులుగా అధికారులు ఇంటికి పంపలేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మంగళవారం నుంచి 10 మంది ఉద్యోగులు ఢిల్లీ ఆఫీసులోనే ఉన్నారు. బీబీసీ డాక్యుమెంటరీపై కేంద్రం నిషేధాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో మరో పిల్‌ దాఖలైంది. బీబీసీపై ఐటీ సోదాలపై పలు జాతీయ ఇంగ్లిష్‌ పత్రికలు తమ సంపాదకీయాల్లో కేంద్రం చర్యలను తప్పుబట్టాయి. సోదాల టైమింగ్‌ను హైలెట్‌ చేసిన ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’.. ప్రతీకార చర్యల ప్రకియలో ఇది మొదటి అడుగు అని పేర్కొన్నది. తనకు వ్యతిరేకంగా ఉంటే మోదీ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందనే విషయాన్ని ‘టెలిగ్రాఫ్‌’ వివరించింది. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే వారిపై ఇలాంటి చర్యలు సాధారణంగా మారాయని ‘ది హిందూ’ కేంద్రం తీరును ఎత్తిచూపింది. దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నదని ‘ట్రిట్యూన్‌’ ఆందోళన వ్యక్తం చేసింది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్‌ బీబీసీపై ఐటీ సోదాల ద్వారా ప్రపంచానికి దేశ ప్రతిష్టను దెబ్బతీసే సందేశం పంపిందని ‘దక్కన్‌ క్రానికల్‌’ వ్యాఖ్యానించింది.

ఢిల్లీ, ముంబై  బీబీసీ కార్యాలయాల్లో 60 గంటల పాటు ఐటీ సోదాలు
ఢిల్లీ,ముంబై బీబీసీ కార్యాలయాలు