ఫిర్యాదు చేయడానికి వచ్చిన బాలికపై కానిస్టేబుల్ అత్యాచారం.. బెంగళూరులో ఘోరం

ఫిర్యాదు చేయడానికి వచ్చిన బాలికపై కానిస్టేబుల్ అత్యాచారం.. బెంగళూరులో ఘోరం
  • హోటల్ కు తీసుకెళ్లి, మద్యం తాగించి ఘోరం
  • వీడియోలతో బెదిరింపులకు పాల్పడ్డ కానిస్టేబుల్
  • పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేసిన పోలీసులు

ఓ యువకుడు తనపై అత్యాచారం చేశాడని, న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లిందో బాలిక. ఫిర్యాదు తీసుకుని చర్యలు తీసుకోవాల్సిన కానిస్టేబుల్ ఆమెపై అత్యాచారం చేసిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ఆ దారుణాన్ని వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేయడంతో ఎవరికీ చెప్పుకోలేక కుమిలిపోయిందా బాలిక. గతేడాది జులైలో జరిగిన దారుణం తాజాగా బాధితురాలి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు యువకుడితో పాటు కానిస్టేబుల్ పై పోక్సో కేసు నమోదు చేసి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. 

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. స్నేహం పేరుతో దగ్గరైన విక్కీ అనే యువకుడు తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని బాధిత బాలిక మైకో లేఔట్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లింది. ఈ క్రమంలో ఆ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న అరుణ్ సదరు బాలికకు సహాయం చేస్తానని నమ్మబలికాడు. అనంతరం మాయమాటలు చెప్పి,  ఓ హోటల్ కు తీసుకువెళ్లి మద్యం తాగించాడు. ఆ మత్తులో బాలికపై అఘాయిత్యం చేశాడు. ఆపై వీడియోలు తీసి ఈ దారుణాన్ని ఎవరికైనా చెబితే వాటిని ఇంటర్ నెట్ లో పెడతానంటూ బెదిరించాడు. 

దీంతో బాలిక భయాందోళనలకు గురై మౌనంగా ఉండిపోయింది. గతేడాది జులైలో ఈ దారుణం జరగగా ఇటీవల బాధితురాలు ఆ విషయాన్ని తన తల్లికి చెప్పింది. దీంతో మైకో లేఔట్ పోలీస్ స్టేషన్ లో బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు విక్కీతో పాటు కానిస్టేబుల్ అరుణ్ ను అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేశారు.