Crime News: అమ్మాయే కదా అని లిఫ్ట్ ఇచ్చారో.. మీ పని అయిపోయినట్టే!

BSR NEWS
- జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద లిఫ్ట్ అడిగిన మహిళ
- కొద్దిదూరం వెళ్లగానే దుస్తులు చింపుకొని లైంగికదాడికి యత్నించావంటూ బెదిరింపులు
- అడిగినంత ఇవ్వకుంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్న మహిళ
- నేరుగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన డ్రైవర్
- తాను న్యాయవాదినన్న నిందితురాలు
లిఫ్ట్ అడుగుతున్నది ఆడపిల్ల.. పోనీలే కదా అని ఇచ్చారో, ఇక మీ పని అయిపోయినట్టే. ఆ తర్వాత కాసేపటికే ఆమె తన అసలు రూపాన్ని బయటకు తీస్తుంది. దుస్తులు చింపేసుకుని లైంగిక దాడికి యత్నించారంటూ గగ్గోలు పెడుతుంది. అడిగిన మొత్తం ఇవ్వకుంటే కేసు పెడతానని బెదిరిస్తుంది. ఇలా ఎంతోమంది నుంచి అందినకాడికి దండుకున్న ఆమె ఇప్పుడు పోలీసులకు చిక్కి కటకటాలు లెక్కపెట్టుకుంటోంది.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్ రేషంబాగ్ ప్రాంతానికి చెందిన కారు డ్రైవర్ పరమానంద మంగళవారం రాత్రి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి కేబీఆర్ పార్క్ వైపు కారులో వెళ్తున్నాడు. ఈ క్రమంలో చెక్‌పోస్టు వద్ద ఓ మహిళ లిఫ్ట్ అడిగింది. కారు కొద్దిదూరం వెళ్లగానే ఆమె దుస్తులు చింపుకొని డబ్బులు ఇవ్వాలని బెదిరించింది. లేదంటే లైంగికదాడికి పాల్పడ్డావని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది.
తొలుత కంగారుపడిన పరమానంద.. ఆ తర్వాత ఆమెను తీసుకుని నేరుగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. ఇన్‌స్పెక్టర్ సతీశ్‌కు అసలు విషయం అర్థమై వారిని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. నిందితురాలిని విచారించిన పోలీసులు ఆమెను సుల్తానా (32)గా గుర్తించారు.
తాను న్యాయవాదినని చెప్పుకున్న ఆమె వద్ద లభించిన పుస్తకంలో పలు ఆధారాలను గుర్తించారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఆమెపై 15కుపైగా కేసులు ఉన్నట్టు గుర్తించి అరెస్ట్ చేశారు. ఆమె గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు బార్ అసోసియేషన్‌కు లేఖ రాయాలని పోలీసులు భావిస్తున్నారు. కాగా, ఇటీవల బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ ఇలాంటి ప్రయత్నంలోనే ఓ మహిళ అరెస్ట్ అయింది.