పూణె లైంగికదాడి నిందితుడిని పోలీసులు ఎలా వెంటాడారో తెలుసా?

పూణె లైంగికదాడి నిందితుడిని పోలీసులు ఎలా వెంటాడారో తెలుసా?
  • BSR NEWS
  • నిందితుడి కోసం డ్రోన్లతో జల్లెడ పట్టిన పోలీసులు
  • బంధువుల ఇంటికి వెళ్లి షర్ట్ మార్చుకుని వెళ్లిపోయిన రాందాస్
  • చెరుకుతోటలో దాక్కున్న నిందితుడిని పట్టించిన పోలీసు శునకాలు
  • నిందితుడు రాజకీయంగానూ యాక్టివ్
  • గత ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులతో ఫొటోలు
  • దోపిడీలు, దొంగతనాల కేసుల్లో జైలు శిక్ష
  • 2019 నుంచి బెయిలుపైనే నిందితుడు

మహారాష్ట్రలోని పూణె, స్వర్‌గేట్ బస్ స్టేషన్‌లో బస్సు కోసం వేచి చూస్తున్న యువతిపై లైంగికదాడికి తెగబడిన నిందితుడు దత్తాత్రేయ రాందాస్‌ను 75 గంటల తర్వాత గత రాత్రి క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో జరిగిన ఈ ఘటన దుమారం రేపడంతో తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం నిందితుడి కోసం వేట ప్రారంభించింది. ఈ క్రమంలో 13 పోలీసులు బృందాలు నిందితుడి కోసం వేట కొనసాగించాయి. డ్రోన్లు, 100 మంది పోలీసులు పూణె, దానిని ఆనుకుని ఉన్న జిల్లాలను జల్లెడ పట్టారు. 

మరోవైపు, పూణెలో అఘాయిత్యానికి తెగబడిన నిందితుడు గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో ఓ బంధువు ఇంటికి వెళ్లాడు. రాందాస్ చేసిన దారుణం గురించి వారికి అప్పటికే తెలిసి ఉండటంతో వారు వెంటనే పోలీసులను అప్రమత్తం చేశారు. ఆ ఇంటి నుంచి వెళ్లిపోవడానికి ముందు రాందాస్ ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాడు. తాను తప్పు చేశానని, పోలీసులకు లొంగిపోతానని వారికి చెప్పి వెళ్లిపోయాడు. 

నిందితుడు షర్ట్ మార్చుకున్నట్టు గుర్తించిన పోలీసులు డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు. అవి నిందితుడు తప్పించుకున్న మార్గాన్ని పసిగట్టాయి. చివరికి బంధువుల ఇంటి సమీపంలో ఓ కాల్వ పక్కనున్న చెరుకు తోటలో అతను దాక్కున్నట్టు శునకాలు గుర్తించాయి. గ్రామస్థుల సహకారంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పూణెకు తరలించారు. అక్కడ అతడిని అరెస్ట్ చేసినట్టు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారికంగా ప్రకటించింది. 

శ్రీరూర్‌కు చెందిన 37 ఏళ్ల నిందితుడిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. శ్రీరూర్, షికార్‌పూర్‌ సహా పలు స్టేషన్లలో ఆరు కేసులు నమోదయ్యాయి. దోపిడీ, చోరీలు వంటి కేసులు కూడా రాందాస్‌పై నమోదయ్యాయి. 2019లో లోన్ తీసుకుని కారు కొనుగోలు చేసిన నిందితుడు పూణె-అహిల్యానగర్ రూట్‌లో నడిపేవాడు. వృద్ధులను ఎక్కువగా లక్ష్యంగా చేసుకునేవాడు. లిఫ్ట్ ఇచ్చేవాడు. వారు కారులో ఎక్కిన తర్వాత నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి కత్తితో బెదిరించి నగలు, డబ్బు దోచుకుని పరారయ్యేవాడు.  

2020లో ఓ దోపిడీ కేసులో ఆరు నెలల జైలు శిక్ష కూడా అనుభవించాడు. తర్వాత పలు కేసుల్లో బెయిలుపై ఉన్నాడు. అంతేకాదు, రాందాస్ రాజకీయాల్లోనూ క్రియాశీలంగా ఉండేవాడు. ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు నాయకులతో అతను కలసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గునాత్ గ్రామంలోని సంగర్ష్-ముక్తి సమితిలో సీటు కోసం పోటీ చేసినప్పటికీ ఓటమి పాలయ్యాడు.