బాబర్ పచ్చి మోసగాడు.. పాకిస్థానీలు తప్పుడు వ్యక్తులను తమ హీరోలు అనుకున్నారు: షోయబ్ అక్తర్

- ఛాంపియన్స్ ట్రోఫీలో పేలవ ప్రదర్శనతో ఇంటిముఖం పట్టిన ఆతిథ్య పాక్
- నాకౌట్ దశలోనే తమ జట్టు టోర్నీ నుంచి వైదొలగడాన్ని జీర్ణించుకోలేకపోతున్న ఫ్యాన్స్, మాజీలు
- చెత్త ప్రదర్శనతో దేశం పరువు తీశారంటూ ఆటగాళ్లపై దుమ్మెత్తిపోస్తున్న వైనం
- స్టార్ ప్లేయర్ బాబర్ ఆజంను ఏకిపారేసిన పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్
ఛాంపియన్స్ ట్రోఫీలో పేలవ ప్రదర్శనతో ఆతిథ్య పాకిస్థాన్ జట్టు ఇంటిముఖం పట్టిన విషయం తెలిసిందే. దీంతో సెమీస్ చేరకుండానే తమ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించడాన్ని ఆ దేశ అభిమానులు, మాజీ ప్లేయర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. చెత్త ప్రదర్శనతో దేశం పరువు తీశారంటూ ఆటగాళ్లపై దుమ్మెత్తిపోస్తున్నారు.
ఈ క్రమంలో పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కూడా పాకిస్థాన్ జట్టుపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డాడు. ప్రధానంగా బాబర్ ఆజంను ఏకిపారేశాడు. బాబర్ మోసగాడని, పాకిస్థానీలు తప్పుడు వ్యక్తిని తమ హీరోగా ఎంచుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
మనం తరచు విరాట్ కోహ్లీతో బాబర్‌ను పోలుస్తున్నాం. కానీ, అది తప్పు. సచిన్ టెండూల్కర్‌ను ఆదర్శంగా తీసుకున్న కోహ్లీ ఎంతో ఎత్తుకు ఎదిగాడు. అదే.. బాబర్ కు ఆరాధ్య క్రికెటర్ అంటూ లేడు, తన రక్షణాత్మక క్రికెట్ శైలితో దేశాన్ని మోసగిస్తున్నాడు.
"మేము ఎప్పుడూ బాబర్ ఆజంను విరాట్ కోహ్లీతో పోలుస్తాం. ఇప్పుడు చెప్పండి విరాట్ కోహ్లీ హీరో ఎవరు? సచిన్ టెండూల్కర్. అతను 100 సెంచరీలు సాధించాడు. విరాట్ అతని వారసత్వాన్ని అనుసరిస్తున్నాడు. బాబర్ ఆజం హీరో ఎవరు? తుక్ తుక్ (ఏ క్రికెటర్ పేరు చెప్పకుండా). మీరు తప్పు హీరోలను ఎంచుకున్నారు. మీ ఆలోచనా విధానం తప్పు.
మీరు మొదటి నుంచి మోసగాడిని నమ్ముతున్నారు. పాకిస్థాన్ క్రికెట్ జట్టు గురించి మాట్లాడటానికి కూడా నేను ఇష్టపడను. ఇంకా చెప్పాలంటే సమయం వృధా. 2001 నుంచి నేను పాక్ క్రికెట్ క్షీణతను చూస్తున్నా. నేను చాలా మంది కెప్టెన్లతో కలిసి పనిచేశాను. వారి వ్యక్తిత్వం రోజుకు మూడుసార్లు మారేది" అని షోయబ్ అక్తర్ 'గేమ్ ఆన్ హై' షోలో పేర్కొన్నాడు.