MK Stalin: తమిళనాడు సీఎం స్టాలిన్‌కు చైనా భాషలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ... ఎందుకంటే?

BSR NEWS
- ఇస్రో రెండో రాకెట్ లాంచ్ ప్యాడ్ శంకుస్థాపన సందర్భంగా చైనా జెండా రంగుల్లో స్టాలిన్ ప్రభుత్వం ప్రకటనలు
- చైనా జెండా రంగులు ఉండటంపై తమిళనాడు బీజేపీ తీవ్ర ఆగ్రహం
- ఈ రోజు స్టాలిన్ పుట్టిన రోజు
- స్టాలిన్‌కు ఇష్టమైన భాషలో పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ బీజేపీ చురక
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ పుట్టిన రోజు సందర్భంగా బీజేపీ చైనా భాష మాండరీన్‌లో ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. 'గౌరవనీయులైన ముఖ్యమంత్రి తిరు ఎంకే స్టాలిన్‌కు తమిళనాడు బీజేపీ తరఫున ఆయనకు ఇష్టమైన భాషలో పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు కలకాలం సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం' అని పేర్కొంది. ఈ మేరకు సోషల్ మీడియా దీనిని పోస్ట్ చేసింది. నేడు అనగా మార్చి 1న స్టాలిన్ పుట్టిన రోజు.
ఇటీవల ఓ ప్రకటనలో తమిళనాడు పశుసంవర్ధక శాఖ రాష్ట్రంలోని పలు వార్తా పత్రికల్లో ఇస్రో రాకెట్‌కు భారత జాతీయ జెండాకు బదులు చైనా జెండా రంగులు ఉపయోగించి విమర్శల పాలైంది. తమిళనాడు తూత్తుకుడి జిల్లా కులశేఖరపట్టణంలో ఇస్రో రెండో రాకెట్ లాంచ్ ప్యాడ్‌ను నిర్మిస్తున్నారు. ఇందుకోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తమిళనాడు పశుసంవర్ధక శాఖ మంత్రి అనిత రాధాకృష్ణన్ తమిళనాడులోని పలు వార్తా ప్రతికల్లో ప్రభుత్వం తరుఫున ప్రకటనలు ఇచ్చారు. ఇందులో ఇస్రో రాకెట్‌కు చైనా జెండా రంగులు ఉన్నాయి. ఈ ప్రకటనపై తమిళనాడు బీజేపీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం తీరును తప్పుబట్టింది.
ఇది డిజైనర్ నుంచి జరిగిన పొరపాటు అని మంత్రి అనిత రాధాకృష్ణన్ కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో శుక్రవారం స్టాలిన్ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ దానిని గుర్తు చేస్తూ చైనా భాషలో ఆయనకు శుభాకాంక్షలు చెప్పింది. బీజేపీ చేసిన ఈ ట్వీట్ ఆసక్తికరంగా మారి నెట్టింట వైరల్‌గా మారింది.