Arvind Kejriwal: బీజేపీపై సంచలన ఆరోపణ చేసిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్

BSR NEWS
- 7 మంది ఆప్ ఎమ్మెల్యేలను కొనాలని చూశారని కేజ్రీవాల్ ఆరోపణ
- పార్టీ మారితే రూ.25 కోట్లు ఇస్తామని బీజేపీ ఆఫర్ చేసిందన్న ఢిల్లీ సీఎం
- లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరెస్ట్ అవుతారని బెదిరించాని ఆరోపణ
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంలోని అధికార బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. 7 మంది ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కాషాయ పార్టీ ప్రయత్నించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారితే రూ.25 కోట్లు ఇస్తామంటూ ఎమ్మెల్యేలకు ఆఫర్ చేసిందని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. 21 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ చర్చలు జరిపిందని, ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్‌ను త్వరలోనే అరెస్ట్ చేస్తామంటూ ఎమ్మెల్యేలని బెదిరించారని అన్నారు. ఢిల్లీ సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. ఈ వ్యాఖ్యలకు బీజేపీ ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.
ఆప్‌ను చీల్చేందుకు బీజేపీ ప్రయత్నించిందని అన్నారు. ‘‘ ఇతర ఎమ్మెల్యేలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నాం. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం. మీరు కూడా మాతో రావొచ్చు. 25 కోట్లు ఇస్తాం ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై పోటీ చేయండి’’ అంటూ తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేశారని కేజ్రీవాల్ అన్నారు. అయితే ఆప్ ఎమ్మెల్యేలు అందరూ తిరస్కరించారని పేర్కొన్నారు.