ఐపీఎల్ జ‌ట్ల‌కు బీసీసీఐ షాక్‌.. ప్రాక్టీస్ సెష‌న్ల‌పై ఆంక్ష‌లు!

ఐపీఎల్ జ‌ట్ల‌కు బీసీసీఐ షాక్‌.. ప్రాక్టీస్ సెష‌న్ల‌పై ఆంక్ష‌లు!
  • ఒక్కో జ‌ట్టుకు ఏడు ప్రాక్టీస్ సెష‌న్స్ మాత్ర‌మే
  • మ్యాచ్ ఉన్న రోజుల్లో స్టేడియాన్ని ప్రాక్టీస్ కోసం ఉప‌యోగించ‌రాదు
  • ఐపీఎల్ వేదిక‌ల‌లో ఇత‌ర టోర్నీల నిర్వ‌హ‌ణ‌కు అనుమ‌తి లేదు
  • ఫ్ల‌డ్ లైట్ల కింద కేవ‌లం 3.30 గంట‌లు మాత్ర‌మే ప్రాక్టీస్‌కు అనుమ‌తి
  • రెండు జ‌ట్లు ఒకేసారి ప్రాక్టీస్ చేయాల‌నుకుంటే సెష‌న్ల వారీగా అవ‌కాశం

కొత్త సీజన్‌కు ముందు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జట్ల ప్రాక్టీస్ సెష‌న్ల‌పై బీసీసీఐ ఆంక్ష‌లు విధించింది.  కొత్త ఆంక్ష‌ల‌ ప్రకారం ఒక్కో జ‌ట్టుకు ఏడు ప్రాక్టీస్ సెష‌న్స్ మాత్ర‌మే ఉంటాయి. అలాగే రెండు వార్మప్ మ్యాచ్‌లు మాత్రమే అనుమతించబడతాయి. ఇక మ్యాచ్ ఉన్న రోజుల్లో స్టేడియాన్ని ప్రాక్టీస్ కోసం ఉప‌యోగించ‌రాదు. 

ఐపీఎల్ వేదిక‌ల‌లో ఇత‌ర టోర్నీల నిర్వ‌హ‌ణ‌కు అనుమ‌తి లేదు. ప్రాక్టీస్ మ్యాచ్‌లు ప్రధాన స్క్వేర్‌లోని సైడ్ వికెట్‌లలో ఒకదానిపై జరగాలి. ఫ్ల‌డ్ లైట్ల కింద కేవ‌లం 3.30 గంట‌లు మాత్ర‌మే ప్రాక్టీస్‌కు అనుమ‌తి ఉంటుంది. ఆపరేషనల్ రూల్స్ ప్రకారం ప్రాక్టీస్ మ్యాచ్‌లకు బీసీసీఐ ముందస్తు వ్రాతపూర్వక అనుమతి అవసరం ఉంటుంది. 

సీజన్ కోసం పిచ్‌ను సిద్ధం చేయడానికి సంబంధిత ఫ్రాంచైజీ సీజన్‌లో మొదటి హోమ్ మ్యాచ్‌కు ముందు నాలుగు రోజుల్లో ప్రధాన స్క్వేర్‌లో ఎటువంటి ప్రాక్టీస్ సెషన్‌లు లేదా ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడకూడదు. రెండు జ‌ట్లు ఒకేసారి ప్రాక్టీస్ చేయాల‌నుకుంటే సెష‌న్ల వారీగా అవ‌కాశం ఇస్తారు. ఈ మేర‌కు కొత్త నిబంధనలను బీసీసీఐ నోట్ ద్వారా ఐపీఎల్ జట్లకు తెలియజేసింద‌ని క్రిక్‌బజ్ క‌థ‌నం పేర్కొంది. 

ఇక 2025 ఐపీఎల్‌ సీజన్ మార్చి 22న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ప్రారంభమవుతుంది. మొద‌టి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్‌), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తలపడనున్నాయి.