YS Jagan Delhi Tour : రేపు మళ్లీ ఢిల్లీకి జగన్-రెండు వారాల వ్యవధిలో రెండోసారి..!

Jagan-again-to-delhi-to-meet-modi

YS Jagan Delhi Tour : రేపు మళ్లీ ఢిల్లీకి జగన్-రెండు వారాల వ్యవధిలో రెండోసారి..!

 ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి ఢిల్లీకి వెళ్లబోతున్నారు. రేపు విజయవాడ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి ఢిల్లీ పర్యటనకు వెళ్లేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. ఈసారి టూర్ అజెండా ఏంటో పూర్తిగా తెలియకపోయినా ప్రధాని మోడీ సహా పలువురు కేంద్రమంత్రులతో జగన్ భేటీ అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

సీఎం వైఎస్ జగన్ రేపు ఢిల్లీ టూర్ కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నెల 17న ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన జగన్.. ఇప్పుడు మరోసారి ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. గత రెండు వారాల్లో సీఎం జగన్ ఢిల్లీలో పర్యటించబోతుండటం ఇది రెండోసారి. దీంతో ఈ టూర్ లో జగన్ ఎవరెవరిని కలవబోతున్నారు, ఏం చర్చించబోతున్నారనే అంశం ఉత్కంఠ రేపుతోంది.

నిన్న సీఎం జగన్ ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తో రాజ్ భవన్ లో భేటీ అయ్యారు. ఇందులో పలు కీలక అంశాల్ని ఆయన చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, ఏపీ బడ్డెట్ తో పాటు పలు అంశాలు వీరిద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఢిల్లీ టూర్ కు జగన్ బయలుదేరనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ టూర్ లో జగన్ కు ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ వరకూ లభించినట్లు తెలుస్తోంది. మిగతా అపాయింట్ మెంట్ల కోసం ఇంకా ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.