ఆస్పత్రికి చంద్రబాబు తరలింపు - వీఐపీ గది సిద్దం..!??

టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యం పైన చర్చ సాగుతోంది. చంద్రబాబు కుటుంబ సభ్యులతో సహా పార్టీ నేతలు ఆయన ఆరోగ్యం పైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. జైలు అధికారులు చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారని స్పష్టం చేసారు. ఆయన భద్రత పై పూర్తి బాధ్యత తమదేనని చెప్పారు. ఇదే సమయంలో అవసరమైతే రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

చంద్రబాబు ఆరోగ్యం: స్కిల్ స్కాంలో చంద్రబాబు రాజమండ్రి జైలులో రిమాండ్ లో ఉన్నారు. 35 రోజులుగా జైలు లో ఉన్న చంద్రబాబు డీహైడ్రేషన్ కు గరరయ్యారు. ఆయన శరీరం పైన దద్దుర్లు వచ్చినట్లు తెలపటంతో ప్రభుత్వాస్పత్రి నుంచి ప్రత్యేక నిపుణులు వచ్చి పరీక్షించారు. వైద్యులు సూచించిన లోషన్లు..క్రీములు అందించినట్లు జైలు అధికారులు వెల్లడించారు

చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారని అధికారులు స్పష్టం చేసారు. ఇదే సమయంలో చంద్రబాబు కుటుంబ సభ్యులు..పార్టీ ముఖ్య నేతలు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిని ప్రభుత్వంలోని ముఖ్య నేతలు ఖండించారు. ఈ సమయంలోనే రాజమహేంద్రవరం లోని సర్వజనాసుపత్రికి అవసరమైతే తరలించేందుకు వీలుగా అధికారులు చర్యలు ప్రారంభించినట్లు చెబుతున్నారు.

ప్రభుత్వాస్పత్రిలో ఏర్పాట్లు: రాజమహేంద్ర వరం ప్రభుత్వాస్పత్రిలో ఉన్న వీఐపీ చికిత్స గదిని అధికారులు అత్యవసరంగా శుక్రవారం అర్ద్రరాత్రి సిద్దం చేయాలని సిబ్బందికి సూచనలు చేయటం..పనులు ప్రారంభించటంతో ఇక్కడకు చంద్రబాబును తరలించే అవకాశం ఉందనే అంచనాలు మొదలయ్యాయి. క్యాజువాలిటీ పక్కనున్న ఆ గదిలో రెండు ఆక్సిజన్ బెడ్లు..ఒక ఈసీజీ విమషన్..వెంటిలేటర్..వైద్య పరికరాలు అందుబాటులో ఉంచారు. ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగానికి చెందిన వైద్యుడితో పాటుగా ఇద్దరు క్యాజువాలిటీ డాక్టర్లు..మరో ఇద్దరు స్టాఫ్ నర్సులను కేటాయించారు. వీరంతా శుక్రవారం అర్దరాత్రి నుంచే అందుబాటులో ఉన్నారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలకు చెందిన అధికారులు..సిబ్బంది అందుబాటులో ఉండాలని అధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది.

ముందస్తు చర్యలు: జైలులో ఇప్పటికే ప్రభుత్వాస్పత్రి నుంచి ఇద్దరు చర్మ సంబంధిత వైద్యులు చంద్రబాబును పరీక్షించి కొన్ని మందులు సూచించారు. కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో జైలు అధికారులు మీడియా సమావేశం ద్వారా స్పష్టత ఇచ్చారు. చంద్రబాబు భద్రత..ఆరోగ్యం గురించి ఆందోళన అవసరం లేదని వెల్లడించారు. ఇదే సమయంలో వైద్యులు చికిత్స అవసరమని సూచిస్తే అప్పుడు..వెంటనే ఆస్పత్రికి తరలించేందుకు వీలుగా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఆరోగ్యం గురించి అధికారులు పూర్తి అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అవసరమైతే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించే క్రమంలో భాగంగానే ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం.