YS Sharmila: సీఎం జగన్ ఇంటికి వెళ్లిన షర్మిల.. చివరి నిమిషంలో వెనక్కి వచ్చేసిన విజయమ్మ వైఎస్ షర్మిల వెంట కడపకు వచ్చిన తల్లి విజయమ్మ.. ఆ తర్వాత షర్మిలతో కలిసి జగన్ వద్దకు మాత్రం...

BSR NEWS
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఏపీలోని తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి వెళ్లారు. కడప నుంచి ప్రత్యేక విమానంలో షర్మిల కుటుంబ సభ్యులు గన్నవరం చేరుకుని, ఆ తర్వాత తాడేపల్లిలో తన అన్నను కలిశారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను జగన్‌కు షర్మిల అందించారు.
జగన్ నివాసంలో షర్మిల దాదాపు అరగంట పాటు ఉన్నట్లు తెలుస్తోంది. జగన్‌ను శుభలేఖను అందించిన తర్వాత షర్మిల ఢిల్లీకి బయలుదేరారు. రేపు ఆమె ఢిల్లీ కాంగ్రెస్ నేతలతో సమావేశం కానున్నారు. షర్మిల రేపు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఇప్పటికే స్పష్టమైంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఢిల్లీలో పర్యటించనున్నారు.
తాడేపల్లికి షర్మిలతో పాటు వెళ్లినవారిలో వధూవరులు, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉన్నారు. వధూవరుల నిశ్చితార్థం, పెళ్లి తేదీలను వైఎస్ షర్మిల ఇప్పటికే వెల్లడించారు. రాజారెడ్డికి అట్లూరి ప్రియతో జనవరి 18న నిశ్చితార్థం, ఫిబ్రవరి 17న పెళ్లి జరుగుతుందని చెప్పారు.
వైఎస్ షర్మిల వెంట కడపకు వచ్చిన తల్లి విజయమ్మ.. ఆ తర్వాత షర్మిలతో కలిసి జగన్ వద్దకు మాత్రం వెళ్లలేదు. కడప నుంచి తిరిగి హైదరాబాద్ వెళ్లారు. షర్మిల వెంట జగన్ ఇంటికి విజయమ్మ కూడా వెళ్తారని అందరూ భావించారు. అయితే, ఆమె అక్కడకు వెళ్లలేదు.