'మా ఊరి పొలిమేర 2' (ఆహా) మూవీ రివ్యూ

BSR NERWS
Movie Name: Maa Oori Polimera 2
- సీక్వెల్ గా వచ్చిన 'మా ఊరి పొలిమేర 2'
- నవంబర్ 3న విడుదలైన సినిమా
- ఈ రోజు నుంచే మొదలైన స్ట్రీమింగ్
- నిధి - క్షుద్రవిద్యల చుట్టూ తిరిగే కథ
- అడుగడునా ఉత్కంఠను రేకెత్తించే కథనం
- ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం ప్రత్యేక ఆకర్షణ
సత్యం' రాజేశ్ హీరోగా కొంతకాలం క్రితం ఓటీటీ ద్వారా పలకరించిన 'మా ఊరిపొలిమేర' సినిమాకి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఆ సినిమా సీక్వెల్ గా 'మా ఊరిపొలిమేర 2'ను రూపొందించారు. నవంబర్ 3వ తేదీన విడుదలైన ఈ సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. అలాంటి ఈ సినిమా ఈ రోజు నుంచే 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. రహస్య నిధి - క్షుద్ర శక్తుల నేపథ్యంలో నడిచే ఈ కథ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
ఈ కథ అంతా కూడా 'జాస్తిపల్లి'కీ .. హిమాలయ ప్రాంతానికి మధ్య నడుస్తుంది. కొమరయ్య ( సత్యం రాజేశ్) చనిపోయాడని అతని భార్యా బిడ్డలతో పాటు అందరూ నమ్ముతారు. అతని తమ్ముడైన జంగయ్య (బాలాదిత్య) పోలీస్ కావడం వలన అంతా ఆరాతీస్తాడు. తన అన్నయ్య చనిపోలేదనే విషయం అతనికి అర్థమవుతుంది. ఆ విషయాన్ని వదిన లక్ష్మి (కామాక్షి భాస్కర్ల) కు .. స్నేహితుడు బలిజయ్య (గెటప్ శ్రీను)కి చెబుతాడు. తన అన్నయ్యను వెతుక్కుంటూ బయల్దేరతాడు.
బలిజయ్య శబరిమల నుంచి తిరిగి వస్తుండగా, కేరళ ఫారెస్టు ప్రాంతంలో అతనికి కొమరయ్య తారసపడతాడు. ఆ అడవిలో కొమరయ్య క్షుద్ర విద్యలను నేర్చుకుంటూ ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు. ఊళ్లో కవిత చనిపోవడం గురించి అంతా మాట్లాడుకుంటున్నారనీ, సర్పంచ్ కూతురు ఏమైందో తెలియడం లేదనే విషయాన్ని కొమరయ్యతో బలిజయ్య చెబుతాడు. చనిపోయింది కవిత కాదనీ, ఆమెను తనతోనే తీసుకొచ్చానని కొమరయ్య చెబుతాడు. చనిపోయింది సర్పంచ్ కూతురని తెలిసి బలిజయ్య షాక్ అవుతాడు.
తమ ఊరు పొలిమేరలో మూయబడి ఉన్న ఆలయంలో అపారమైన నిధి ఉందనీ, ఆ ఆలయాన్ని నిర్మించిన ట్రావెన్ కోర్ రాజు, అక్కడి నేలమాళిగలో ఆ నిధిని దాచాడని కొమరయ్య చెబుతాడు. ఆ నిధిని బయటికి తీయాలంటే, కొన్ని క్షుద్ర విద్యలు తెలియాలనీ, అవి నేర్చుకోవడం కోసమే తాను కేరళా వచ్చానని అంటాడు. ఆ నిధిని బయటికి తీయడానికి చేసిన ప్రయత్నంలోనే తన తండ్రి చనిపోయాడనీ, అందువలన ఆ పనిని తాను పూర్తి చేయాలని అంటాడు.
ఇదిలా ఉండగా 'జాస్తిపల్లి'కి కొత్త ఎస్.ఐ.గా వచ్చిన రవీంద్ర నాయక్ కి, కొమరయ్య తమ్ముడు 'జంగయ్య' ఆచూకీ లేకుండా పోయాడని తెలుస్తుంది. దాంతో అతని జాడ కనిపెట్టడం కోసం రంగంలోకి దిగుతాడు. 'జాస్తిపల్లి' ఆలయంలో నిధి ఉందనే విషయం, పురావస్తు శాఖలో పనిచేసే ఒక అవినీతి పరుడికి తెలుస్తుంది. దాంతో ఆ నిధిని చేజిక్కించుకోవడం కోసం, తన వైపు నుంచి ప్రయత్నాలు మొదలుపెడతాడు. జంగయ్య ఏమైపోయాడు? కొమరయ్య ప్రయత్నం ఫలిస్తుందా?
అపారమైన ఆ నిధి ఎవరికి దక్కుతుంది? అనేవి ఈ కథలోని ఆసక్తికరమైన అంశాలు.
ఊరిపొలిమేరలో .. పూజలకు దూరంగా ఉన్న ఒక ఆలయంలో అపారమైన నిధి ఉందని కొమరయ్య అనే ఆటో డ్రైవర్ కి తెలుస్తుంది. ఆ నిధి అక్కడ నిజంగానే ఉందనే సంగతి పెదనాన్న వలన రూఢీ అవుతుంది. కొమరయ్య తండ్రి .. పెదనాన్న .. తాత అందరూ క్షుద్ర విద్యలను నేర్చినవారే. ఆ గుడిలోని ఆ నిధిని దక్కించుకోవడం కోసం కొమరయ్య కూడా ఆ మార్గంలో వెళ్లడమే కథ. అదే నిధి కోసం మరికొందరు అవినీతిపరులు రంగంలోకి దిగడమే మరో ఆసక్తికరమైన అంశం.
ఈ కథను దర్శకుడు అనిల్ విశ్వనాథ్ తయారు చేసుకున్నాడు. కథ మొదలైన దగ్గర నుంచి చివరి వరకూ ఎక్కడా ఆసక్తి తగ్గకుండా .. పట్టు సడలకుండా ముందుకు తీసుకుని వెళ్లాడు. కొమరయ్య పాత్రలో భార్య పట్ల ప్రేమ .. కాలేజ్ రోజుల్లోప్రేమించిన అమ్మాయి పట్ల కోరిక .. డబ్బు పట్ల వ్యామోహం .. అందుకోసం ఏం చేయడానికైనా వెనుకాడని స్వభావాన్ని దర్శకుడు చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించాడు. కొమరయ్య భార్య లక్ష్మితో పాటు మిగతా పాత్రలను డిజైన్ చేసిన తీరు కూడా ఆకట్టుకుంటుంది.
కథను ఎప్పటికప్పుడు మలుపులు తిప్పుతూ వెళ్లాడు. కథకి అవసరమైన అమావాస్య - పౌర్ణమి రోజులను హైలైట్ చేస్తూ వెళ్లాడు. అందువలన ఏ క్షణంలో ఏం జరుగుతుందో .. ఎవరు కారకులో అనే ఒక ఉత్కంఠతో ఆడియన్స్ ఫాలో అవుతూ ఉంటారు. స్క్రీన్ ప్లే ఈ సినిమాను నిలబెట్టేసిందనే చెప్పాలి. కథలో ఎక్కడ ఏ అంశం రివీల్ కావాలో .. అక్కడే రివీల్ అవుతుంది. అలాగే డైలాగ్స్ చాలా సహజంగా ఉంటూనే, ఆసక్తిని పెంచేస్తాయి. సత్యం రాజేశ్ .. కామాక్షి భాస్కర్ల .. గెటప్ శ్రీను నటన హైలైట్.
ఇలాంటి థ్రిల్లర్ కథలు ఎక్కువగా ఫొటోగ్రఫీ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై ఆధారపడి ఉంటాయి. కుశేన్దర్ రమేశ్ రెడ్డి ఫొటోగ్రఫీ .. గ్యాని నేపథ్య సంగీతం ఈ సినిమాకి చాలా హెల్ప్ అయ్యాయని చెప్పాలి. శ్రీవర ఎడిటింగ్ కూడా నీట్ గా ఉంది. ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు .. అనవసరమైన సీన్స్ లేవు. ప్రీ క్లైమాక్స్ .. క్లైమాక్స్ విషయంలో కూడా ఆడియన్స్ కి ఎలాంటి అసంతృప్తి ఉండదు. పైగా ఆ తరువాత రానున్న 3వ భాగం పై కూడా కుతూహలాన్ని రేకెత్తిస్తాయి.