చిన్నారి ప్రాణం తీసిన పల్లీ గింజ

BSR NEWS
- హైదరాబాద్ లష్కర్‌గూడలో విషాదం
- చిన్నారి పల్లీలు తింటుండగా గొంతులో ఇరుక్కున్న పల్లీ గింజ
- ఆసుపత్రిలో చికిత్స చేస్తుండగానే కన్నుమూసిన చిన్నారి
రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం లష్కర్‌గూడలో నాలుగేళ్ల చిన్నారి పల్లిగింజ గొంతులో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర ఆవేదనకు గురిచేసింది.
అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, లష్కర్‌గూడ నివాసితులైన బండారి మహేశ్వరి, శ్యామ్‌సుందర్ దంపతుల ఏకైక కుమార్తె తన్విక (4). ఆ చిన్నారి ఆదివారం ఇంట్లో వేయించిన పల్లీలు తింటుండగా, ప్రమాదవశాత్తు ఓ పల్లిగింజ గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న విషయాన్ని తన్విక తల్లిదండ్రులకు చెప్పింది.
విషయం తెలుసుకున్న వెంటనే ఆందోళనకు గురైన తల్లిదండ్రులు, తన్వికను హుటాహుటిన హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు, గొంతులో పల్లిగింజ ఇరుక్కున్నట్లు నిర్ధారించారు. ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగానే పరిస్థితి విషమించడంతో తన్విక మరణించినట్లు వైద్యులు తెలిపారు.
ఒక్కగానొక్క కుమార్తె అకాల మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ విషాద ఘటనపై చిన్నారి తల్లి మహేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్నామని, దర్యాప్తు చేస్తున్నామని అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు వెల్లడించారు.