Joe Biden: జో బైడెన్ మానసిక ఆరోగ్యం గురించి వైట్ హౌస్ డాక్టర్ ఏమన్నారంటే...!

Joe Biden: జో బైడెన్ మానసిక ఆరోగ్యం గురించి వైట్ హౌస్ డాక్టర్ ఏమన్నారంటే...!

BSR NEWS

  • అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మానసిక ఆరోగ్యంపై సందేహాలు
  • మతిమరపు, అయోమయంతో పలుమార్లు ఇబ్బందిపడిన బైడెన్
  • బైడెన్ మెదడుకు వచ్చిన ఢోకా ఏమీలేదన్న డాక్టర్ 

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మానసిక ఆరోగ్యంపై ఎప్పటినుంచో సందేహాలు ఉన్నాయి. ఒకరి పేరుకు బదులు మరొకరి పేరు పలకడం, ఎగ్జిట్ ఒకవైపు ఉంటే మరోవైపు వెళ్లడం, భార్య అనుకుని మరో మహిళను ముద్దాడబోవడం... ఇలాంటివి చాలా ఘటనలు బైడెన్ ఆరోగ్యంపై విమర్శలకు దారితీశాయి. 

వయసు 81 సంవత్సరాలు కాబట్టి మతిమరపు, అయోమయం సహజమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నా, అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తి కాబట్టి అది చాలా ప్రమాదకరం అని విమర్శకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో, అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ డాక్టర్ ఒకరు ఆసక్తికర అంశం వెల్లడించారు. 

డాక్టర్ కెవిన్ ఓ కానర్ దీనిపై న్యూయార్క్ పోస్ట్ పత్రికతో మాట్లాడారు. బైడెన్ మెదడుకు వచ్చిన ఢోకా ఏమీలేదని, ఆయన మానసిక ఆరోగ్యం దివ్యంగా ఉందని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. చాలామంది అంటున్నట్టుగా ఆయనకు పార్కిన్సన్ వ్యాధికి సంబంధించిన ఎలాంటి సమస్యా లేదని స్పష్టం చేశారు. పదవీకాలం ముగిసేనాటికి ఆయన ఆరోగ్యంలో గణనీయమైన మార్పులు ఏమీ ఉండకపోవచ్చని డాక్టర్ కెవిన్ ఓ కానర్ తెలిపారు. 

బైడెన్ ఇటీవలే అమెరికా అధ్యక్ష రేసు నుంచి అనూహ్య రీతిలో వైదొలగడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.