Land Titling Act: తెలంగాణలో ధరణి.. ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. ఈ వివాదాలేంటి?

ప్రస్తుతం ఎన్నికల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అత్యంత వివాదాస్పదం అవుతోంది.' నీ పేరు మీద ఉన్న భూమి.. తెల్లారేసరికి వేరే ఎవరి పేరు మీదో మారుతుంది. మీ ఆస్తులకు మీరు యజమాని కాకుండా పోతారు.
Land Titling Act: ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వివాదం ఏంటి? అసలు ఈ చట్టం ఉద్దేశం ఏంటి? అధికార పక్షం చెబుతున్నట్టు భూ సమస్యల పరిష్కారానికా? విపక్షం చెబుతున్నట్టు భూ హక్కులు కాలరాసేందుకా? తెలంగాణ ఎన్నికల్లో ధరణి పోర్టల్ మాదిరిగా.. ఇప్పుడు ఏపీ ఎన్నికల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వివాదం అవుతోంది. ఎన్నికల ప్రచారాస్త్రంగా మారింది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023ను రాష్ట్రంలో ఎంపిక చేసిన 16 రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రయోగాత్మంగా అమలు చేస్తున్నారు. ఇటీవల ఏపీ రిజిస్ట్రేషన్ కమిషనర్ ప్రత్యేక ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎంపిక చేసిన 16 సబ్ రిజిస్టర్ ఆఫీసుల పరిధిలో స్థిరాస్తుల కొనుగోలుదారులకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ బదులు జిరాక్స్ పత్రాలు ఇచ్చేలా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై వివాదం అలుముకుంది. దేశంలో తొలిసారి అమలవుతున్న ఈ చట్టం వల్ల తమ భూములకు రక్షణ లేకుండా పోతుందనే ఆందోళన ప్రజల్లో వ్యక్తం అవుతోంది.
ఈ చట్టం భూకబ్జాదారులకు వరంగా మారుతుందని విపక్షాలు ఆరోపించడం ప్రారంభించాయి. అధికారులు చేసిన తప్పిదాల కారణంగా స్థిరాస్తుల వివాద పరిష్కారం కోసం కోర్టుకు వెళ్లిన ప్రజలు.. తిరిగి ఈ యాక్ట్ తో అధికారుల వద్దకే వెళుతున్నారని న్యాయవాదులు ఆందోళన చెందుతున్నారు. బడా పారిశ్రామికవేత్తలకు భూ సేకరణలో వివాదాలు లేకుండా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని న్యాయవాదులు చెబుతున్నారు. భూ కొనుగోలు విక్రయాల్లో జరిగే అవకతవకలను ట్రైబ్యునళ్లలో ప్రభుత్వం నియమించే టిఆర్వోలు పరిష్కరిస్తారని ప్రభుత్వం చెబుతోంది. అయితే దీనివల్ల ప్రజలకు నష్టమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ప్రస్తుతం ఎన్నికల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అత్యంత వివాదాస్పదం అవుతోంది.’ నీ పేరు మీద ఉన్న భూమి.. తెల్లారేసరికి వేరే ఎవరి పేరు మీదో మారుతుంది. మీ ఆస్తులకు మీరు యజమాని కాకుండా పోతారు. భూయాజమాన్య వివాదాలపై విచారణ జరిపి తీర్పులిచ్చే అధికారం సివిల్స్ కోర్టులకు లేకుండా చేశారు. కేవలం అప్పిలేట్ ట్రైబ్యునల్ ను మాత్రమే ఆశ్రయించాలి. మీ భూమి ఎవరి పేరిట మారిందనేది మీకు మీరుగా తెలుసుకోవాలి. 90 రోజుల్లోగా తెలుసుకోకపోతే ఇక ఇంతే సంగతులు ‘ అంటూ విపక్షాలు చేస్తున్న ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. యాక్ట్ కారణంగా పట్టాదారు పాసు బుక్, అడంగల్ లాంటి రెవెన్యూ రికార్డులు ఎందుకు పనికిరాకుండా పోతాయని.. ఈ ఆధారాలు ఏవి లేకుండా పోతే.. భూములు ఎవరి చేతుల్లో కైనా వెళ్లే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. చిన్న సన్న కారు రైతుల దగ్గర్నుంచి భూములను చట్టప్రకారం కొట్టేయడానికి ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చిందని విపక్షాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం ప్రారంభించాయి. తాము అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని కూడా హామీ ఇచ్చాయి. ఈ విషయాన్ని మేనిఫెస్టోలో చేర్చాయి.
అయితే ఈ యాక్ట్ విషయంలో ప్రభుత్వం వాదన వేరేలా ఉంది. ఈ చట్టం అమల్లోకి వస్తే 99 శాతం భూ వివాదాలు పరిష్కారం అవుతాయని ప్రభుత్వం చెబుతోంది. వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమి.. ఇలా అన్ని భూములకు సంబంధించి ఒకటే టైటిల్ రిజిస్టర్ వస్తుందని సర్కార్ చెబుతోంది. భూములకు సంబంధించి రాష్ట్రంలో 30కి పైగా రికార్డులు ఉన్నాయి. ఒకవేళ రికార్డుల్లో పేరు ఉన్నా.. వేరే వ్యక్తులు భూమి తమదని అప్పీలు చేసుకునే అవకాశం ఉందని.. అదే ఈ ఆక్ట్ అమల్లోకి వస్తే భూ యజమానులకు భరోసావస్తుందని ప్రభుత్వం చెబుతోంది. వివాదాలు ఉన్న భూములను ప్రత్యేకంగా వివాదాల రిజిస్టర్లు నమోదు చేస్తారని.. అభ్యంతరాలు లేని పేర్లే టైటిల్ రిజిస్టర్లు నమోదు చేస్తారని.. వివాదాల పరిష్కారం కోసం జిల్లా స్థాయిలో ఒక ట్రైబ్యునల్, రాష్ట్రస్థాయిలో మరో ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ రెండింట తీర్పులపై అభ్యంతరాలు ఉంటే హైకోర్టును కూడా ఆశ్రయించవచ్చని ప్రభుత్వం చెబుతోంది. కేవలం భూ సమస్యల పరిష్కారం కోసమే తాము ఈ యాక్ట్ ను తీసుకొచ్చామని.. కానీ విపక్షాలు లేనిపోని భ్రమలు కల్పించి.. ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయని ప్రభుత్వం చెబుతోంది. మొత్తానికైతే ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వివాదం రాజకీయ పార్టీలకు ప్రచారాస్త్రంగా మారింది.