Smitha Sabarwal: నేను తెలంగాణ వీడట్లేదు..అదంతా ఫేక్: ఐఏఎస్ ఆఫీసర్ స్మిత సబర్వాల్

BSR NEWS
- కొత్త ప్రభుత్వం ఏర్పడి వారం కావస్తున్నా సీఎంను కలవని స్మిత సబర్వాల్
- స్మిత డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసులకు వెళ్లబోతున్నారంటూ మీడియాలో కథనాలు
- ఆ వార్తలన్నీ నిరాధారమని స్పష్టీకరణ
- రాష్ట్రంలోనే ఉంటానని, ప్రభుత్వం ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్తిస్తానని వెల్లడి
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి దాదాపు వారం గడుస్తున్నా ఐఏఎస్ అధికారిణి స్మిత సబర్వాల్ ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకోలేదు. ప్రభుత్వం మారిన సందర్భంలో కొత్త సీఎంను అధికారులు మర్యాదపూర్వకంగా కలవడం ఆనవాయతీ కావడంతో స్మిత సబర్వాల్ తీరుపై సర్వత్రా చర్చ మొదలైంది. ఈ క్రమంలో ఆమె డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసులకు వెళ్లబోతున్నారని, ఇప్పటికే దరఖాస్తు కూడా చేసుకున్నారని వార్తలు వెలువడ్డాయి. కొత్త ఛాలెంజ్‌కు సిద్ధమంటూ ఇటీవల ఆమె చేసిన పోస్ట్ మరింత సంచలనానికి దారి తీసింది.
ఈ నేపథ్యంలో స్మిత ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. తాను సెంట్రల్ సర్వీసులకు డిప్యుటేషన్‌పై వెళుతున్నానంటూ కొన్ని మీడియా ఛానెళ్లు ఫేక్ న్యూస్ ప్రసారం చేశాయని ఆమె స్పష్టం చేశారు. ఇవన్నీ నిరాధారమని పేర్కొన్నారు. తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌గా తాను రాష్ట్రంలోనే కొనసాగుతానని, ప్రభుత్వం ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు. తెలంగాణలో విధి నిర్వహణ తనకెంతో గర్వకారణమని పేర్కొన్నారు.
కేసీఆర్ ప్రభుత్వంలో స్మిత సబర్వాల్ కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన ఆమె.. మిషన్ భగీరథ, కాళేశ్వరం వంటి పథకాలను పర్యవేక్షించారు.