Pawan Kalyan : చంద్రబాబు, నేను కలిసి నిర్ణయించుకుంటాం- సీఎం పదవిపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
BSR NEWS
నా అభిమానులు, జనసైనికుల ఆత్మగౌరవాన్ని తక్కువ చేయను. మీ ఆత్మగౌరవాన్ని కాపాడతాను.
సీఎం పదవి, పొత్తుల అంశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం ఎవరు అన్నది నేను, చంద్రబాబు కలిసి నిర్ణయించుకుంటాము అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలంటే పొత్తులు తప్ప మరో దారి లేదన్నారు పవన్ కల్యాణ్. విశాఖపట్నం ఎంవీపీ కాలనీలో బహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. రాబోయే ఎన్నికలకు వంద రోజుల ప్రణాళికపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం అభ్యర్థి, పొత్తుల అంశాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు జనసేనాని.
టీడీపీ వెనుక నడవటం లేదు..
”మేమిద్దరం(పవన్, చంద్రబాబు) కూర్చుని చర్చించుకంటా. అందరి అభిప్రాయాలు తీసుకుంటాం. ప్రజలతో కూర్చుని ఎలా తీసుకెళితే బాగుంటుంది అని డిస్కషన్ చేస్తాం. అన్నీ ముందు మీ ముందు ఉంచుతాం. మీకు మాటిస్తున్నా. అన్నీ చెప్పే చేస్తాను. లోపాయికారిగా ఏదీ చేయను. మేము ఎవరికీ బీ పార్టీ కాదు. తెలుగుదేశం పార్టీ వెనుక నడవటం లేదు. తెలుగుదేశం పార్టీతో కలిసి నడుస్తున్నాం.
మీ ఆత్మగౌరవాన్ని తక్కువ చేయను..
నా అభిమానులు, జనసైనికుల ఆత్మగౌరవాన్ని తక్కువ చేయను. మీ ఆత్మగౌరవాన్ని కాపాడతాను. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలి అంటే పొత్తులు తప్ప మరో దారి లేదు. మనం ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే కచ్చితంగా జనసేన ఓటింగ్ పెరుగుతుంది. మనకు బలమున్న స్థానాల్లో గెలవొచ్చు. 35 నుంచి 40వరకు స్థానాలు రావొచ్చు. కానీ, ఆ బలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సరిపోదు. ఆ చాన్సు నేను తీసుకోదల్చుకోలేదు. మరో ఐదేళ్లు ఆలస్యం అయితే నిరుద్యోగులు ఎక్కడికి వెళతారు? ఉపాధి అవకాశాల కోసం ఎక్కడికి వెళ్తారు? మీ వయసు మీరిపోతుంది? అందుకే నేను ఛాన్సు తీసుకోవడం లేదు. మిమ్మల్ని గెలిపించడానికి నన్ను నేను తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నా” అని పవన్ కల్యాణ్ అన్నారు.
నేను బీజేపీలో చేరితే కోరుకున్న పదవి ఇస్తారు..
”విశాఖ ఉక్కు-ఆంధ్రుల ఆత్మగౌరవం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకూడదని కేంద్రం పెద్దలతో మాట్లాడాను. నేను ఓట్లు కోసం రాలేదు. మార్పు కోసం వచ్చాను. ఉత్తరాంధ్ర నాకు ఇష్టమైన ప్రాంతం. ఉత్తరాంధ్రలో వలసలు ఆగాలి. నేను భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాను. దశాబ్ద కాలం ఓటమితో నేను ముందుకు వెళ్తున్నా. ఉత్తరాంధ్రలో ఉపాధి అవకాశాలు ఇక్కడే ఉండేలా కృషి చేస్తాను. నేను బీజేపీలో జాయిన్ అయితే నాకు కోరుకున్న పదవి ఇస్తారు. రాజధానికి దారేది? ఈరోజుకు ఆంధ్రప్రదేశ్ కు రాజధాని లేదు.
జనసేనను విలీనం చేయను..
కాలుష్యం తగ్గేలా నియంత్రణ ఉండాలి. ప్రతీ 30 కిలోమీటర్లకు మత్స్యకారులకు జెట్టీలు ఉండాలి. ఉత్తరాంధ్ర బీసీలకు తెలంగాణలో గుర్తింపు లేదు. స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా కృషి చేస్తున్నాం. జనసేనకు అండగా నిలబడితే స్టీల్ ఫ్లాంట్ కోసం సంపూర్ణంగా నిలబడతాను. వైసీపీ ప్రభుత్వంలో మహిళలపై దాడులు పెరిగాయి. నేను జనసేన పార్టీని మరొక పార్టీలో ఎప్పుడూ విలీనం చేయను.