ఏపీ ఎన్నికల్లో భారీ మెజారిటీలు ఇవే

BSR NEWS
టిడిపి కూటమి అభ్యర్థులు అయితే భారీ మెజారిటీలను నమోదు చేశారు. గాజువాక నుంచి పోటీ చేసిన టిడిపి అభ్యర్థి పల్లా శ్రీనివాస్ 95, 235 ఓట్లతో గెలుపొందారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నెన్నో సంచలనాలు నమోదయ్యాయి. టిడిపి కూటమి ఘనవిజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ ఒంటరిగా 135 స్థానాల్లో గెలుపొందింది. అటు జనసేన సైతం సంపూర్ణ విజయం సాధించింది. పోటీ చేసిన 21 చోట్ల విజయ బావుటా ఎగురవేసింది.బిజెపి పది నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఎనిమిదింట విజయం సాధించింది. కానీ వైసీపీ ఘోరంగా 11 సీట్లతో సరిపెట్టుకుంది. టిడిపి కూటమి గెలిచిన చోట భారీ మెజారిటీలు నమోదయ్యాయి. కానీ వైసీపీ గెలిచిన చోట తక్కువ మెజారిటీతో బయటపడింది.
టిడిపి కూటమి అభ్యర్థులు అయితే భారీ మెజారిటీలను నమోదు చేశారు. గాజువాక నుంచి పోటీ చేసిన టిడిపి అభ్యర్థి పల్లా శ్రీనివాస్ 95, 235 ఓట్లతో గెలుపొందారు. భీమిలిలో టిడిపి అభ్యర్థి 92,401, మంగళగిరిలో టిడిపి అభ్యర్థి లోకేష్ 91,413, పెందుర్తిలో పంచకర్ల రమేష్ బాబు 81,870, నెల్లూరులో టిడిపి అభ్యర్థి పొంగూరు నారాయణ 72,489, తణుకులో టిడిపి అభ్యర్థి రాధాకృష్ణ 72,121, కాకినాడ రూరల్ లో జనసేన అభ్యర్థి పంతం నానాజీ 72,040, రాజమండ్రి అర్బన్ లో ఆదిరెడ్డి వాసు 71,404, పిఠాపురంలో జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ 70,279 ఓట్ల మెజారిటీ సాధించారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా అతి తక్కువ మెజారిటీతో గెలిచిన టిడిపి కూటమి అభ్యర్థులు తక్కువ. ప్రతి చోటా భారీ మెజారిటీలు నమోదవుతూ వచ్చాయి.
టిడిపి కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీ సాధించడానికి ప్రధాన కారణం ఓట్ల బదలాయింపు. మూడు పార్టీల మధ్య సమన్వయం బాగా కుదిరింది. ఆపై సీట్ల సర్దుబాటు ప్రక్రియ కూడా సజావుగా ముందుకు సాగింది. మూడు పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు అనుకున్న స్థాయిలో ఫలించింది. ఈ కారణాలతో భారీ మెజారిటీలు నమోదయినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో 20వేల ఓట్లకు తక్కువ కాకుండా కూటమి అభ్యర్థులకు మెజారిటీ లభించడం విశేషం.