Rahul Gandhi: రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో క్లారిటీ ఇచ్చిన ఏఐసీసీ జనరల్ సెక్రటరీ!

Rahul Gandhi: రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో క్లారిటీ ఇచ్చిన ఏఐసీసీ జనరల్ సెక్రటరీ!
  • BSR NEWS
  • వచ్చే ఏడాది జరగనున్న లోక్ సభ ఎన్నికలు
  • ప్రస్తుతం వయనాడ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్
  • వచ్చే ఎన్నికల్లో కూడా వయనాడ్ నుంచే పోటీ చేస్తారన్న తారిఖ్ అన్వర్

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. లోక్ సభ ఎన్నికలపై అప్పుడే అన్ని పార్టీలు దృష్టిని సారించాయి. ఇప్పటి నుంచే వ్యూహాలను రచించుకుంటున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రస్తుతం కేరళలోని వయనాడ్ లోక్ సభ స్థానం నుంచి పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన యూపీలోని అమేథీ, కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేశారు. వయనాడ్ లో విజయాన్ని సాధించిన ఆయన... అమేథీలో మాత్రం ఓటమిపాలయ్యారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ఆసక్తి సర్వత్ర నెలకొంది. 

ఈ క్రమంలో రాహుల్ విషయంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, కేరళ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ తారిఖ్ అన్వర్ క్లారిటీ ఇచ్చారు. రాహుల్ వయనాడ్ నుంచే మరోసారి పోటీ చేస్తారని ఆయన చెప్పారు. వయనాడ్ నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలు రాహుల్ కు మెండుగా ఉన్నాయని అన్నారు. ఓ లీడింగ్ టీవీ ఛానల్ తో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు స్పష్టతనిచ్చారు. ఉత్తర భారతం నుంచి కూడా రాహుల్ పోటీ చేస్తారా? అనే ప్రశ్నకు బదులుగా... నార్త్ ఇండియా నుంచి రాహుల్ పోటీ చేస్తారని తాను భావించడం లేదని... ఆ విషయంపై ఆయనే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.