Hyderabad News: మద్యం అలవాటు మానుకోవాలని మందలించిన సోదరి.. యువకుడి ఆత్మహత్య

Hyderabad News: మద్యం అలవాటు మానుకోవాలని మందలించిన సోదరి.. యువకుడి ఆత్మహత్య

BSR NEWS

  • హైదరాబాద్ శివారులోని కందుకూరులో ఘటన
  • ఇటుకల బట్టీలో పనిచేస్తున్న యువకుడు
  • ఇటీవల మద్యానికి బానిసైన బిష్ణు
  • సోదరి మందలింపుతో మనస్తాపం చెంది ఇంటి నుంచి వెళ్లి బలవన్మరణం

మద్యం తాగొద్దని కుటుంబ సభ్యులు మందలించినందుకు మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ శివారులోని కందుకూరులో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం ఒడిశాకు చెందిన బిష్ణు మజిహి (27)  నగరానికి వచ్చి తన సోదరి జయ కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. కందుకూరు సమీపంలోని రాయిచూరులో ఓ ఇటుకలబట్టీలో పనిచేస్తున్నాడు.

బిష్ణు ఇటీవల మద్యానికి బానిసయ్యాడు. బుధవారం రాత్రి అందరూ భోజనానికి కూర్చున్న సమయంలో  మద్యం మత్తులో వచ్చిన సోదరుడిని చూసి జయ మందలించింది. మద్యం మానుకోవాలని హితవు పలికింది. ఆమె మాటలతో మనస్తాపం చెందిన బిష్ణు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. రాత్రి పొద్దుపోయినా ఇంటికి చేరుకోకపోవడంతో అతడి కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఇంటికి సమీపంలో బిష్ణు విగతజీవిగా కనిపించాడు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.