గాంధీ-నెహ్రూ కుటుంబ కంచుకోట బద్ధలయిందా.. యూపీలో ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితేంటి?

BSR NEWS
ఉత్తర భారతదేశంలో పార్టీ బలహీనంగా ఉండడంతో దక్షిణాది రాష్ట్రాల నుంచి రాహుల్, ప్రియాంక పోటీచేయాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది.
Nehru Gandhi Family in UP Elections: దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్.. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట. నెహ్రూ-గాంధీ వారసులకు పెట్టని కోట. నెహ్రూ తరం నుంచి రాహుల్ దాకా అందరూ యూపీ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. గాంధీ పేరుంటే చాలు..ఉత్తరప్రదేశ్‌లో ఏ నియోజకవర్గం నుంచైనా గెలుపుఖాయం. అమేథీ, రాయ్‌బరేలీ, ఫిలిబిత్, సుల్తాన్‌పూర్ ఇలా రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల పేర్లు వింటే గాంధీ నెహ్రూ కుటుంబ వారసత్వమే గుర్తొస్తుంది. అలాంటి రాష్ట్ర్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితేంటి? గాంధీ-నెహ్రూ కుటుంబ వారసులు యూపీలో గెలిచే పరిస్థితులు ఉన్నాయా..?
కాంగ్రెస్ దేశరాజకీయాలపై ఏకఛత్రాధిపత్యం సాగిస్తున్న రోజుల్లో అన్ని రాష్ట్రాల్లోలానే ఉత్తరప్రదేశ్‌లో కూడా హస్తం పార్టీ బలంగా ఉండేది. అలాగే గాంధీ-నెహ్రూ కుటుంబానికి ఉత్తరప్రదేశ్ తో ఎంతో అనుబంధం ఉండేది. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ నుంచే దేశ తొలి ప్రధాని నెహ్రూ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. ఫుల్పూర్, రాయబరేలీ నుంచి నెహ్రూ గెలిచారు. నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీ, అల్లుడు ఫిరోజ్ గాంధీ, ఇందిర కుమారులు రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ, మేనకగాంధీ, వరుణ్ గాంధీ, సోనియా, రాహుల్ గాంధీ.. ఇలా గాంధీ-నెహ్రూ కుటుంబ వారసులెందరినో ఉత్తరప్రదేశ్ ఎంపీలను చేసింది. రాయబరేలీ, అమేథీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ రెండు నియోజకవర్గాలు గాంధీ-నెహ్రూ కుటుంబానికి పెట్టని కోటగా ఉండేవి. ఫిలిబిత్, సుల్తాన్‌పూర్ నియోజవర్గాలకు మనేక, వరుణ్ గాంధీ ప్రాతినిధ్యం వహిచంఆరు.
గాంధీ-నెహ్రూ కుటుంబ కంచుకోట బద్ధలయిందా?
ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 80 లోక్‌సభ స్థానాలున్నాయి. ప్రస్తుత లోక్‌సభలో ఆ రాష్ట్ర్రం నుంచి కాంగ్రెస్‌కు ఉన్న ఒకే ఒక్క ఎంపీ సోనియాగాంధీ. 2004, 2009,2014,2019 ఎన్నికల్లో వరుసగా రాయ్‌బరేలీ నుంచి సోనియా గెలుపొందారు. ఒకప్పుడు మెజార్టీ ఎంపీ స్థానాలు గెలుచుకునే యూపీలో కాంగ్రెస్ ఒక్కస్థానానికే పరిమితం కావడమంటే పార్టీ ఆ రాష్ట్రంలో ఏ స్థాయిలో బలహీనపడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మూడున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్ అక్కడ అధికారంలో లేదు. యూపీలో బలంగా ఉన్న పార్టీలతో పొత్తు పెట్టుకుని రాష్ట్రంలో అస్తిత్వాన్ని చాటుకుంటోంది. అయితే ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఆ రాష్ట్రంలోని రెండు స్థానాల్లో గెలిచేది మాత్రం కాంగ్రెస్సే. అవే రాయబరేలీ, అమేథీ. సమాజ్‌వాదీ, బహుజన సమాజ్‌వాదీ పార్టీలు బలంగా ఉండి.. తిరుగులేని అధికారం చెలాయిస్తున్న సమయంలోనూ రాయబరేలీ, అమేథిలో గాంధీ-నెహ్రూ కుటుంబ వారసులే ప్రాతినిధ్యం వహించేవారు. అయితే గత ఎన్నికల్లో అమేథీ నుంచి రాహుల్ గాంధీ ఓడిపోవడంతో గాంధీ-నెహ్రూ కుటుంబ కంచుకోట బద్ధలయిందా అన్న సందేహాలు మొదలయ్యాయి.
రాహుల్ అమేథీ నుంచి పోటీచేస్తారా?
రాహుల్ గాంధీ లోక్‌సభ ప్రవేశం అమేథీ నుంచే జరిగింది. 2004 ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథీ నుంచి ఎంపీ అయి లోక్‌సభలో అడుగుపెట్టారు. రాహుల్ రాజకీయ జీవితం అమేథీ నుంచే మొదలయింది. కానీ 2019 ఎన్నికల్లో రాహుల్ స్మృతి ఇరానీ చేతిలో అమేథీ నుంచి ఓటమి పాలవడం కాంగ్రెస్ వర్గాలనే కాదు.. యావత్ దేశాన్ని షాక్‌కు గురిచేశాయి. రాహుల్ నియోజకవర్గానికి రావడం లేదని, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం లేదని ప్రచారం చేస్తూ వచ్చిన బీజేపీ 2019 ఎన్నికల్లో ఆయనను ఓడించింది. అమేథీతో పాటు కేరళలోని వాయనాడ్ నుంచి రాహుల్ పోటీచేయడంతో అక్కడ గెలవడం ద్వారా లోక్‌సభకు వెళ్లారు రాహుల్. భారత జోడో న్యాయయాత్రలో భాగంగా రాహుల్ అమేథిలో పర్యటించినప్పుడు రాహుల్ అక్కడ పోటీ గురించి మరోసారి చర్చ మొదలయింది. రాహుల్ అమేథీ నుంచి పోటీచేస్తారా లేదా అన్నది ఇంకా తేలలేదు. ఈ ఎన్నికల్లో యూపీలో 17 స్థానాలు కాంగ్రెస్‌కు కేటాయించింది మిత్ర పక్షం సమాజ్‌వాదీ పార్టీ. ఈ 17 స్థానాల్లో అమేథీ, రాయబరేలీ నుంచి ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారన్నది తేలాల్సి ఉంది.
ప్రచారం చేయాల్సిన అవసరం లేకుండానే..
నెహ్రూ-గాంధీ కుటుంబ వారసులు ప్రచారం చేయాల్సిన అవసరం లేకుండానే.. నియోజకవర్గం మొహం చూడకపోయినా.. రాయ్‌బరేలీ, అమేథీ ప్రజలు వారిని గెలిపిస్తారన్నది అందరి అభిప్రాయం. కానీ అమేథీలో రాహుల్ ఓటమితో ఆ అభిప్రాయం తప్పని తేలింది. ఎన్నికల్లో గెలిచినా, గెలవకపోయినా రాహుల్ అంటే అమేథీ ప్రజలకు ఎంతో అభిమానం ఉంటుంది. భారత జోడో న్యాయయాత్రకు వచ్చిన స్పందనే దీనికి ఉదాహరణ. అయితే రాహుల్ ఎన్నికల్లో ఓటమి తర్వాత నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని, ఐదేళ్లలో కేవలం రెండు సార్లు మాత్రమే అమేథికి వచ్చారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అలా కాకుండా రాహుల్ అమేథిపై ప్రత్యేకదృష్టిపెట్టాలని.. ఇక్కడినుంచే ఎన్నికల్లో పోటీచేయాలని, నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి పక్కనపెడితే.. గాంధీ-నెహ్రూల వారసత్వ ప్రభావం ఇప్పటికీ అమేథీ ప్రజలపై ప్రభావం చూపుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాజీవ్‌గాంధీని ఎంతగానో అభిమానించిన అమేథీ ప్రజలు.. అదే ప్రేమను రాహుల్‌పైనా చూపుతున్నారని.. ఒక్కసారి ఓడిపోయినంతమాత్రాన రాహుల్‌కు నియోజకవర్గంతో అనుబంధం పోదని వారి అభిప్రాయం.
ప్రియాంక అక్కడినుంచి పోటీచేస్తారా?
వరుసగా నాలుగుసార్లు ఎంపీగా గెలిచిన నియోజకవర్గం రాయబరేలీ నుంచి ఈ సారి పోటీచేయడం లేదని సోనియా ప్రకటించడంతో తెరపైకి ప్రియాంక పేరు వచ్చింది. రాయబరేలీ నుంచి ప్రియాంక, అమేథీ నుంచి రాహుల్ పోటీచేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. రాయబరేలీ నియోజకవర్గం నుంచి నెహ్రూ, ఇందిర, సోనియా ప్రాతినిధ్యం వహించారు. ఆ వారసత్వాన్ని ప్రియాంక కొనసాగిస్తారని భావిస్తున్నారు. మరి ప్రియాంక అక్కడినుంచి పోటీచేస్తారా…? చేస్తే గెలుస్తారా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దేశానికి ప్రధానులు అందించిన రాయబరేలీ.. ఎమర్జెన్సీ విధింపునకూ కారణమైంది. ఆ నియోజకవర్గంలో అసలు గాంధీ-నెహ్రూ కుటుంబం పట్టు ఎలా ఉంది..?
ప్రత్యక్ష ఎన్నికలకు సోనియాగాంధీ దూరం
అనారోగ్యం, వృద్ధాప్యం కారణంగా సోనియాగాంధీ ఈ సారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయడం లేదు. రాజస్థాన్ నుంచి ఆమె రాజ్యసభకు వెళ్తున్నారు. వరుసగా నాలుగుసార్లు గెలిపించిన రాయబరేలీ ప్రజలకు సోనియా భావోద్వేగ లేఖ రాశారు. రాయబరేలీ నుంచి సోనియా తప్పుకోవడంతో ఆ స్థానం నుంచి ప్రియాంక గాంధీ పోటీచేయాలన్న డిమాండ్ బయలుదేరింది. ఇప్పటికే ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. ఎన్నికలు జరిగే ప్రతిరాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. కాంగ్రెస్‌లో ఎలాంటి పదవులూ లేనప్పటికీ రాహుల్‌తో కలిసి పార్టీ రాజకీయాలను నడిపిస్తున్నారు. అదే తరహాలో ఇప్పుడు తల్లి సోనియా, నాయనమ్మ ఇందిర వారసురాలిగా.. రాయబరేలీ నుంచి ప్రియాంక చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు కోరుతున్నారు.